వక్ఫ్ సవరణ బిల్లు 2025ను లోక్సభ ఆమోదించింది. వాడిగా వేడిగా సుదీర్ఘంగా సాగిన చర్చ తర్వాత బిల్లు మీద జరిగిన ఓటింగ్లో అధికార పక్షం విజయం సాధించింది. బిల్లును ఇండీ కూటమి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి, బీజేపీ దాని మిత్రపక్షాలు బలంగా సమర్ధించాయి. ఈ బిల్లు వల్ల వక్ఫ్ బోర్డుల పనితీరులో పారదర్శకత, సమర్ధత వస్తాయని వాదించాయి. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన పలు సవరణలను ప్రభుత్వం తోసిపుచ్చింది.
కేంద్ర పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. దానిపై 12 గంటలకు పైగా సుదీర్ఘంగా వాదోపవాదాల నడుమ చర్చ జరిగింది. చివరికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా బిల్లుపై ఓటింగ్ పెట్టారు. బిల్లుకు అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి. దాంతో బిల్లుకు సభ ఆమోదం లభించిందని సభాపతి ప్రకటించారు.
ఇండీ కూటమి పార్టీలు బిల్లును వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నాయి, ఆ ప్రకారమే ఆ పార్టీల ఎంపీలు ఓట్లు వేసారు. కొన్ని సవరణల మీద డివిజన్ కోసం వారు ప్రయత్నించారు. ఒక సవరణను అయితే తోసిపుచ్చగలిగారు కూడా. ఆ సవరణకు అనుకూలంగా 231 ఓట్లు వస్తే, వ్యతిరేకంగా 238 ఓట్లు పడ్డాయి. ఆ బిల్లుతో పాటే ముసల్మాన్ వక్ఫ్ (రిపీల్) బిల్లు 2024ను కూడా సభ ఆమోదించింది.
ఈ బిల్లును మొదట గతేడాది ఆగస్టులో లోక్సభలో ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్షాల డిమాండ్ మేరకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసారు. జేపీసీ చేసిన సిఫారసులను బిల్లులో పొందుపరిచారు. ఆ మార్పుచేర్పుల తర్వాత బిల్లును ఆమోదం కోసం లోక్సభలో బుధవారం మరోసారి ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ దాదాపు పన్నెండు గంటల పాటు సాగింది.
మంత్రి కిరెన్ రిజిజు చర్చకు సమాధానమిస్తూ విపక్షాలను తీవ్రంగా దుయ్యబట్టారు. వక్ఫ్ సవరణ బిల్లును ‘రాజ్యాంగ వ్యతిరేకం’ అంటూ ప్రతిపక్షాలు పిలవడంపై రిజిజు మండిపడ్డారు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన చట్టం దశాబ్దాలుగా ఉనికిలో ఉందనీ, దాన్ని కోర్టులు ఏనాడూ కొట్టిపారేయలేదనీ గుర్తు చేసారు. ‘రాజ్యాంగ వ్యతిరేకం’ లాంటి తీవ్రమైన పదాలను అలవోకగా వాడేయడం సరికాదంటూ హితవు పలికారు. ఈ బిల్లు పాస్ అయాక దేశంలోని పేద ముస్లిములు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెబుతారన్నారు.
వక్ఫ్ సవరణ బిల్లు ముస్లిములకు వ్యతిరేకంగా ఉందంటూ ప్రతిపక్షాలు చేసిన విమర్శలను కిరెన్ రిజిజు తిరస్కరించారు. బిల్లుకు సంబంధించిన అన్ని విషయాలనూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చక్కగా వివరించారనీ, కానీ ఆ నిజాన్ని ఒప్పుకోడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా లేవనీ మండిపడ్డారు.