భారతదేశంలో వక్ఫ్ ఆస్తులను నిర్వహించడం, అభివృద్ధి చేయడానికి 1964లో ఏర్పాటు చేసిన వక్ఫ్ బోర్డ్ చరిత్ర ఆద్యంతం వివాదాస్పదమే. వక్ఫ్ బోర్డు భారత రాజ్యాంగంలో 30వ అధికరణం కింద పనిచేస్తుంది. మతపరమైన లేక దాతృత్వం కోసం కేటాయించిన ఆస్తులను వక్ఫ్ అంటారు. వాటిని నిర్వహించే బాధ్యత ఆ బోర్డుది. కేంద్రీయ వక్ఫ్ బోర్డు దేశంలోని అన్ని వక్ఫ్ ఆస్తులనూ చూసుకుంటుంది. రాష్ట్రస్థాయిలో వాటిని పర్యవేక్షించేది రాష్ట్ర వక్ఫ్ బోర్డులు.
ఆక్రమణల ఆరోపణలు:
వక్ఫ్ బోర్డు మీద ప్రధానంగా వినవచ్చే ప్రధానమైన ఆరోపణ ఏంటంటే… వివిధ భూములు, ప్రభుత్వ స్థలాల మీద అవి వక్ఫ్ ఆస్తులు అనే ముద్ర వేసి వాటిని లాగేసుకుంటూ ఉంటుంది. ఏదైనా ఒక స్థలంలో ఒక మసీదు లేదా ఒక చిన్న మజార్ ఏర్పాటు చేసి అక్కడ ఇస్లామిక్ ఆచారాలను పాటించడం మొదలుపెడతారు. కొన్నాళ్ళకు వక్ఫ్ బోర్డు ఆ ఆస్తి తమదని ప్రకటిస్తుంది. అలాంటి దుశ్చర్యల మీదనే ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఢిల్లీలోని ఒక ఫ్లైఓవర్ మీద మజార్ నిర్మించేసారు. ఒక మౌల్వీ అక్కడ ఆ మజార్ ఎన్నో తరాల నుంచీ ఉందంటూ చెప్పేస్తున్నాడు. అంటే ఆ ఫ్లైఓవర్ ఇక వక్ఫ్ ఆస్తి అన్నమాట. విచిత్రం ఏంటంటే ఆ ఫ్లైఓవర్ కట్టిందే 2010లో. దాన్నిబట్టి ఆ సోకాల్డ్ మజార్ చట్టబద్ధతే అనుమానాస్పదంగా మారిపోయింది. ఇంకా చెప్పుకోవాలంటే, అసలు అనుమానమే లేదు. ఫ్లైఓవర్ మీద తమ మతపు నిర్మాణం ఉందని అసలు ఎంత ధైర్యంగా చెబుతున్నారో.
2009లో కె రెహమాన్ ఖాన్ నేతృత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఇచ్చిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 4లక్షల రిజిస్టర్డు స్థలాలు, 6లక్షల ఎకరాల భూమి అంతా వక్ఫ్ బోర్డు నియంత్రణలోనే ఉంది. మొత్తంగా, దేశంలో మూడవ అతిపెద్ద భూ యజమాని వక్ఫ్ బోర్డ్ అన్నది నిజం. మైనారిటీ సంక్షేమం కోసం అంటూ మొదలైన ఒక సంస్థ అంత పెద్ద మొత్తంలో భూమికి యజమానిగా నిలవడం ఆందోళనకరం.
మతపరమైన అక్రమ నిర్మాణాలపై సుప్రీంకోర్టు ఉత్తర్వు:
సుప్రీంకోర్టు 2009 సెప్టెంబర్‌లో ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా మతనిర్మాణాలు చేపట్టడం మీద నిషేధం విధించింది. ఇప్పటికే ఉన్న నిర్మాణాలను సమీక్షించాలని, వాటిలో అనధికారికంగా నిర్మించిన వాటిని తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలనీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఆ ఆదేశాలు బహుశా దేశంలో ఎక్కడా అమలు కాలేదు. 2016లో దేశ రాజధానిలో తొలగించాల్సిన అక్రమ నిర్మాణాల విషయంలో అసమర్ధంగా వ్యవహరించినందుకు ఢిల్లీ హైకోర్టు, రెలిజియస్ కమిటీ ఆఫ్ ఢిల్లీని విమర్శించింది. ఆ అసమర్ధత వల్లనే ఢిల్లీలో పలు మౌలిక వసతుల నిర్మాణ పనుల్లో తీవ్రమైన జాప్యం చోటు చేసుకుంది.