కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ ఆయన 2013లో నాటి యూపీయే ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి ఎందుకు సవరణలు చేసిందంటూ నిలదీసారు.
‘‘2014 లోక్సభ ఎన్నికలకు ముందు 2013లో అప్పటి యూపీయే ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. అవి మీ మనసులో ప్రశ్నలు రేపుతాయి. సిక్కులు, హిందువులు, పార్సీలు తదితరులు కూడా వక్ఫ్ ఇచ్చుకునేలా 2013లో ఆ చట్టంలో మార్పులు చేసారు. నిజానికి వక్ఫ్ అనేది ముస్లిములు అల్లా పేరిట ఇచ్చుకునేది. కాంగ్రెస్ పార్టీ, వక్ఫ్ బోర్డలను కమ్యూనిటీల ఆధారంగా ఏర్పాటు చేసింది. షియా బోర్డుల్లో షియాలు మాత్రమే ఉండేలా చేసారు. సెక్షన్ 108 అనేదాన్ని తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏ ఇతర చట్టం కంటె వక్ఫ్ చట్టానికే అధికారాలు ఎక్కువ ఉంటాయి. అసలు ఆ సెక్షన్ను ఎలా ఆమోదిస్తారు?’’ అని ప్రశ్నించారు.
ఆ మార్పుల ఆధారంగా యూపీయే ప్రభుత్వం 2013లో 123 ఆస్తులను డీనోటిఫై చేసి ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు అప్పగించేసిందని ఆరోపించారు.
‘‘1970 నుంచీ ఢిల్లీలో పలు ఆస్తుల గురించి కేసులు నడుస్తున్నాయి. వాటిలో సీజీఓ కాంప్లెక్స్, పార్లమెంటు భవనం కూడా ఉన్నాయి. వాటిని వక్ఫ్ ఆస్తులు అంటూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు ప్రకటించేసుకుంది. ఆ కేసు ఇంకా కోర్టులో ఉంది. కానీ ఆ సమయంలోనే యూపీయే సర్కారు 123 ఆస్తులను డీనోటిఫై చేసి వక్ఫ్ బోర్డుకు బంగారు పళ్ళెంలో పెట్టి అందించింది. ఇవాళ మనం ఈ సవరణను ప్రవేశపెట్టకపోతే, మనం కూర్చుని ఉన్న పార్లమెంటు భవనాన్ని కూడా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించేసి ఉండేవారు. ప్రధాని మోదీ అధికారంలోకి రాకపోయి ఉంటే, ఎన్నో ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా డీనోటిఫై చేసేసేవారు’’ అని కిరెన్ రిజిజు చెప్పుకొచ్చారు.
‘‘వక్ఫ్ సవరణ బిల్లు ఏ మతవ్యవస్థ, ఏ మత పద్ధతి లేక ఏ మతవిధానంలోనూ ఏవిధంగానూ జోక్యం చేసుకోదు’’ అని కిరెన్ రిజిజు స్పష్టం చేసారు.
బిల్లులోని అంశాలు ఏ మసీదు లేదా గుడి లేదా మరే ఇతర ప్రార్థనా స్థలం నిర్వహణకూ సంబంధించినవి కావని స్పష్టం చేసారు. ‘‘ఇది కేవలం ఆస్తుల నిర్వహణకు సంబంధించిన వ్యవహారం. అయితే వక్ఫ్ ఆస్తులను వక్ఫ్ బోర్డు, ముతవల్లీ నిర్వహిస్తూంటారు. ఆ మౌలికమైన తేడాను అర్ధం చేసుకోకపోతేనో, లేక ఉద్దేశపూర్వకంగా అర్ధం చేసుకోకుండా ఉంటేనో దానికి నేను పరిష్కారం చూపించలేను’’ అని కిరెన్ అన్నారు.
వక్ఫ్ సవరణ బిల్లు 2025తో పాటు కిరెన్ రిజిజు ముసల్మాన్ వక్ఫ్ (రిపీల్) బిల్లు 2024ను కూడా లోక్సభ ముందు ఆమోదం కోసం పెట్టారు.
బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు… వక్ఫ్ సవరణ బిల్లు మీద ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని విమర్శించిన ప్రతిపక్షాల మీద కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకు పడ్డారు. ‘‘మా కమిటీ ప్రజాస్వామికంగా ఉంది, అది మేధోమధనం చేసింది. కాంగ్రెస్ కాలంలో కమిటీ పేరుకి మాత్రమే ఉండేది. మా కమిటీ ఏ విషయాన్నైనా చర్చిస్తుంది, ఆలోచిస్తుంది, వాటి ఆధారంగా అవసరమైన మార్పులు చేస్తుంది’’ అని అన్నారాయన.
ఈ బిల్లును గతేడాది ఆగస్టులో లోక్సభలో ప్రవేశపెట్టారు. తర్వాత బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలో ఒక జేపీసీ సైతం ఈ బిల్లును పరీక్షించింది.
1995 నాటి చట్టాన్ని సవరించాలన్నదే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. దీనివల్ల భారతదేశంలో మసీదుల యాజమాన్యం, నిర్వహణ మెరుగుపడతాయి. గతచట్టంలోని లోటుపాట్లను అధిగమించి, వక్ఫ్ బోర్డుల సమర్ధతను పెంచుతూ, రిజిస్ట్రేషన్ ప్రక్రియను మెరుగుపరిచేలా ఈ చట్టం ఉండబోతోంది.