వక్ఫ్ సవరణ బిల్లుపై ఇవాళ లోక్‌సభలో ఓటింగ్ జరగనుంది. జాతి ప్రయోజనాల దృష్ట్యా ఈ బిల్లును ప్రవేశపెడుతున్నామని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు. ఇవాళ చరిత్రాత్మకమైన దినమని ఆయన అభివర్ణించారు. వక్ఫ్ సవరణ బిల్లు వల్ల పస్మందా ముస్లిములకు మేలు జరుగుతుందని ఆ బిల్లు మీద నియమించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ జగదాంబికా పాల్ వ్యాఖ్యానించారు. మరోవైపు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆ బిల్లుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బిల్లులోని ప్రతీ క్లాజ్ మీదా జేపీసీలో చర్చ జరగాలని, అది జరగలేదనీ లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ అన్నారు.
ఇంతకీ ఈ బిల్లు లోక్‌సభలో పాస్ కావాలంటే ఎంత బలం కావాలి? అన్ని ఓట్లు ఎన్డీయే కూటమికి ఉన్నాయా? ఒక్కసారి గణాంకాలు చూద్దాం…
వక్ఫ్ సవరణ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందడానికి సాధారణ మెజారిటీ అయిన 272 ఓట్లు కావాలి. బీజేపీకి 240మంది ఎంపీలు ఉన్నారు. మిత్రపక్షాలు తెలుగుదేశానికి 16, జేడీయూకు 12 మంది ఎంపీలు ఉన్నారు. లోక్‌జనశక్తి (రాంవిలాస్ పాశ్వాన్) పార్టీకి 5, ఆర్ఎల్డికి 2, శివసేనకు (షిండే వర్గం) 7గురు ఎంపీలు ఉన్నారు. మొత్తంగా ఎన్డీయే కూటమికి 282 మంది ఎంపీల బలం ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జనసేన పార్టీ కూడా వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది.
ఎన్డీయే భాగస్వామ్య పక్షాలన్నీ ఈ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లోనూ మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. మరికొన్ని చిన్నాచితకా పార్టీల మద్దతు కూడా లభిస్తే 295 ఓట్లు అనుకూలంగా పడే అవకాశం ఉంది. అలా లోక్‌సభలో ఈ బిల్లుకు సులువుగానే ఆమోదం పొందవచ్చని బీజేపీ లెక్కలు వేసుకుంది.
రాజ్యసభ ముందుకు ఈ బిల్లు రేపు గురువారం వస్తుంది. అక్కడ కూడా ఎన్డీయే కూటమికి స్వల్ప ఆధిక్యం ఉంది. పెద్దల సభలో మొత్తం 245 మంది ఎంపీలు ఉన్నారు. అక్కడ బిల్లు ఆమోదం పొందాలంటే 119 మంది ఎంపీల మద్దతు కావాలి. బీజేపీకి సొంతంగా 90మంది ఎంపీలు రాజ్యసభలో ఉన్నారు. మిత్రపక్షాలతో కలుపుకుంటే 125 మంది ఎంపీల బలం ఉంది.
ప్రతిపక్షాల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు లోక్‌సభలో 234 మంది ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్, ఎస్పీ, ఎన్సీపీ(ఎస్పీ), తృణమూల్ కాంగ్రెస్, ఆప్, డీఎంకే, కమ్యూనిస్టు పార్టీలు వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తారు. కొన్ని పార్టీలు మాత్రం తటస్థ వైఖరి అనుసరించే అవకాశముంది. అందువల్ల లోక్‌సభలో బిల్లు పాసవడం ఇప్పటికే ఖరారు అయిపోయినప్పటికీ, ఆధిక్యం ఎంత లభిస్తుంది అన్న విషయం మీద ఆసక్తి నెలకొంది.
ఆస్తులన్నీ కాజేసిన అన్నగా జనగ్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు : వైఎస్ షర్మిల