140మీటర్ల వెడల్పుతో భూసమీకరణకు కేంద్రం సమ్మతి
ఇరువైపులా సర్వీసు రోడ్ల నిర్మాణం…
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ORR)ప్రాజెక్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణకు కేంద్రం సమ్మతి తెలిపింది. కేంద్ర రవాణా, జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ త్వరలో ఆదేశాలు జారీ చేయనుంది. తొలుత కేవలం 70 మీటర్ల వెడల్పుతోనే భూసేకరణ చేసేందుకు ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలపగా.. అలా కుదరదని, భవిష్యత్‌లో ఓఆర్‌ఆర్ విస్తరణ, దానికి అనుబంధంగా రైల్వేలైన్ నిర్మాణం, ఇతర అవసరాలకు కు వీలుగా 150 మీటర్లు వెడల్పుతో భూసేకరణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి గడ్కరీని కోరారు. దీంతో 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరిపేలా తాజాగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. సర్వీసు రోడ్లు నిర్మించేందుకు అంగీకరించింది.
అమరావతి ఓఆర్‌ఆర్ ప్రతిపాదనల్లోనే 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ జరపాలని 2018లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల 189.4 కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో ఓఆర్‌ఆర్ నిర్మాణానికి ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం తెలిపింది. అయితే 70 మీటర్ల వెడల్పుతో మాత్రమే భూమి సేకరణ సరిపోతుందని రైల్వేలైన్, ఇతర అవసరాలకు తాము భూమిని సేకరించబోమని వెల్లడిచింది.
దీనిపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంతో పాటు కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడారు. భవిష్యత్‌లో ఓఆర్‌ఆర్‌ను 10 వరుసలకు విస్తరించాల్సి ఉంటుందని, అప్పుడు భూమిని సేకరించాలంటే ఇబ్బందులుంటాయనిని వివరించారు. దీంతో 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణకు గడ్కరీ అంగీకరించారు. అలాగే ఇరువైపులా సర్వీసు రోడ్ల నిర్మాణానికి కేంద్రం సమ్మితించింది.
ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమిక ఆమోదం మేరకు ఓఆర్‌ఆర్ నిర్మాణానికి రూ.16,310 కోట్ల ఖర్చు అవుతుండగా సివిల్ పనుల విలువ రూ.12,955 కోట్లుగా తేలింది. అయితే 1,702 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని, దీనికి రూ.2,665 కోట్లు వెచ్చించనున్నట్లు కమిటీ వివరించింది.