పలనాడు జిల్లా నరసరావుపేటలో మార్చి 16న రెండేళ్ళ చిన్నారి బాలిక చనిపోయింది. దానికి కారణం బర్డ్‌ఫ్లూ అని నిర్ధారణ అయింది. భారత వైద్య పరిశోధనా మండలి ఆ మేరకు రాష్ట్రప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. బర్డ్‌ఫ్లూ కారణంగా మనుషులు చనిపోవడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. అయితే ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసింది.
బాలికకు శ్వాస సమస్యలు, జలుబు, మూర్ఛ, విరేచనాలు తదితర సమస్యలు తలెత్తడంతో మార్చి 4న మంగళగిరి ఎయిమ్స్‌కు తీసుకువెళ్ళారు. అక్కడ వైద్యులు ఆక్సిజన్ పెట్టి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. బాలిక మార్చి 16న తుదిశ్వాస విడిచింది.
పాపకు చికిత్స చేసే సమయంలో మార్చి 7న గొంతు, ముక్కు నుంచి సేకరించిన శ్వాబ్స్‌ను ఎయిమ్స్‌లోని వీఆర్డీఎల్లో పరీక్షించారు. ఆ పరీక్షల్లో ఇన్ఫ్లుయెంజా ఎ పాజిటివ్ అని తేలింది. మార్చి 15న మరో నమూనాను సేకరించి ఢిల్లీ పంపించారు. అక్కడ నివేదిక అనుమానాస్పదంగా వచ్చింది. దాంతో ఐసీఎంఆర్ అప్రమత్తమై, శ్వాబ్ శాంపిల్స్‌ను పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. అక్కడే బాలికకు హెచ్5ఎన్1 వైరస్ సోకిందని నిర్ధారించారు.
బాలిక కుటుంబ సభ్యులను విచారించినప్పుడు ఆమె ఆరోగ్యం గురించి పలు విషయాలు తెలిసాయి. ఆ పాప వీధి కుక్కలతో తరచూ ఆడుకునేదట. బాలికకు ఫిబ్రవరి 28న జ్వరం లక్షణాలు కనిపించాయి. ఫిబ్రవరి 26న పచ్చి కోడి మాంసం తిందని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆ పాప ఇంటి దగ్గర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సర్వే చేపట్టారు. ఇంకెవరికీ ఇలాంటి లక్షణాలు ఏమీ లేవని తేల్చారు.
నరసరావుపేటలో ఇంకెక్కడా ఇలాంటి కేసులు ఏమీ నమోదు కాలేదు. నిజానికి పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి లేనే లేదని పశు సంవర్థక శాఖ అధికారులు వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక అధికారి శ్యామల మంగళవారం నరసరావుపేటలో బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించారు.