ఉత్తరాఖండ్‌లోని పలు ప్రదేశాల పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారతీయ సంస్కృతి, వారసత్వ పరంపర, ప్రజల సెంటిమెంట్లను దృష్టిలో ఉంచుకుని 17 ప్రదేశాల పేర్లు మారుస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. ఆయా రంగాల్లో గొప్ప కృషి చేసిన స్వదేశీ ప్రజ్ఞావంతులకు గౌరవం ఇచ్చేలా ఆ పేర్లు పెట్టారు.
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈ నిర్ణయాన్ని మార్చి 31న వెల్లడించారు. ఏయే ప్రాంతాల పేర్లను మారుస్తున్నారు, అక్కడ కొత్తగా ఏం పేర్లు పెడుతున్నారు అన్న వివరాలను అధికారికంగా ప్రకటించారు. ఆ మేరకు అధికారిక పత్రాల్లో పేర్లమార్పిడి ప్రక్రియ ప్రారంభమైంది.
హరిద్వార్ జిల్లాలోని ఔరంగజేబ్‌పూర్ పేరును శివాజీనగర్‌గా మార్చారు. గాజీవాలీ పేరును ఆర్య నగర్‌గా మార్చారు. చాంద్‌పూర్ జ్యోతిబా ఫూలే నగర్ అయింది. మహమ్మద్‌పూర్ జాట్ కాస్తా మోహన్పూర్ జాట్ అయింది. ఖాన్పూర్ శ్రీకృష్ణపూర్గా మారింది. ఖాన్పూర్ కుర్స్లీ పేరు అంబేద్కర్ నగర్ అయింది. ఇంద్రీష్పూర్ కాస్తా నందపూర్ గా మారింది. అక్బర్పూర్ ఫజల్పూర్ పేరు ఇకపై విజయనగరంగా మారింది.
డెహ్రాడూన్ జిల్లాలో మియావాలా పేరును రాంజీవాలాగా మార్చారు. పీర్‌వాలా ఇకపై కేసరి నగర్ కానుంది. చాంద్‌పూర్ ఖుర్ద్ పేరు పృథ్వీరాజ్ నగర్‌గా మారింది. అబ్దుల్లా నగర్ పేరు దక్ష్ నగర్ అయింది.
నైనిటాల్ జిల్లాలో నవాబీ రోడ్ పేరును అటల్ మార్గ్‌గా మారుస్తున్నారు. పన్చక్కీ ప్రాంతం నుంచి ఐటిఐ వరకూ ఉన్న రహదారికి గురు గోళ్వాల్కర్ మార్గ్ అని పేరు పెట్టనున్నారు.
ఉధమ్‌సింగ్ నగర్లో సుల్తాన్పూర్ పట్టీ ప్రాంతం పేరును కౌసల్యాపురిగా మారుస్తున్నారు.
వలసవాదపు బానిసత్వపు ఛాయలను చెరిపివేయడం ఈ పేర్ల మార్పిడి ప్రధాన లక్ష్యం. దేశంలో వివిధ రంగాల్లో ప్రముఖులను గౌరవించుకోడానికి ఇదొక మార్గం. భారతీయమైన సంస్కృతి పరిరక్షణకు కృషి చేసిన ప్రముఖుల పేర్లను ఆయా ప్రాంతాలకు పెట్టడం ద్వారా ప్రజల్లో వారి స్ఫూర్తిని రగిలించే ప్రయత్నం జరుగుతోంది. అందులో భాగంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ పేర్ల మార్పిడి నిర్ణయం తీసుకుంది.