అవసరం లేకపోయినా కొందరు డాక్టర్లు ఎక్స్రేలు, టెస్టులు రాస్తున్నారని వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. సిజేరియన్ అవసరం లేకపోయినా చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
విజయవాడలోని ఎన్డీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆరుగురు మెడికల్ కౌన్సిల్ సభ్యులను నామినేటెడ్ పోస్టుల్లో నియమించారు. మరో నలుగురు ఎక్స్ అఫీషియో మెంబర్లు, 13 ఎలక్టెడ్ మెంబర్లను ఇంకా ఎన్నుకోవాల్సి ఉంది..
డాక్టర్లు చిరునవ్వుతో రోగులను పలకరించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. జాతీయ వైద్య మండలి నిబంధనలను ప్రతి డాక్టర్ తప్పనిసరిగా పాటించాలని ఆయన కోరారు. ఐదేళ్లకోసారి డాక్టర్లు తమ లైసెన్సులను పొడిగించుకోవాలని గుర్తు చేసారు.
ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు నార్మల్ డెలివరీలు చేస్తే బాగుంటుందని మంత్రి సూచించారు. ప్రజలు కూడా రకరకాల టెస్టులు రాస్తేనే మాకు సరిగ్గా డాక్టర్లు చూశారనే అపోహలో ఉన్నారు. అటువంటి వారికి అవగాహన కల్పించాలని సత్యకుమార్ సూచించారు.