హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారాన్ని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పార్లమెంటులో ప్రస్తావించారు. భూముల వేలాన్ని తక్షణమే ఆపేయాలంటూ రాజ్యసభలో ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు, విశ్వవిద్యాలయ భూములను రక్షించాలంటూ విద్యార్ధులు ఆందోళనలు కొనసాగించారు.
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పార్లమెంటు రాజ్యసభలో సెంట్రల్ వర్సిటీ వ్యవహారంపై మాట్లాడారు. ఉగాది పండుగ రోజు అర్ధరాత్రి సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో బుల్‌డోజర్లు నడిపారని చెప్పారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉచిత హామీల అమలుకు ఎన్ని నిధులైనా సరిపోవడం లేదనీ, అందుకే యూనివర్సిటీ దగ్గర భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో అమలవుతున్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదనీ… రాహుల్ రేవంత్ రాజ్యాంగమనీ వ్యంగ్యంగా అన్నారు. 400 ఎకరాల భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేసారు.
లోక్‌సభలో కూడా బీజేపీ ఎంపీలు ఈ అంశాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. తర్వాత కిషన్ రెడ్డి నేతృత్వంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసారు. బీజేపీ తెలంగాణ ప్రాంత ఎంపీలు కొండా విశ్వేశ్వర రెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, నగేశ్ తదితరులు మంత్రికి వివరించారు. ఆ విషయాన్ని ఈటల రాజేందర్ మీడియాకు వివరించారు. సెంట్రల్ వర్సిటీ భూముల విషయంలో అన్యాయం జరగకూడదంటూ పోరాటం కొనసాగిస్తామని బీజేపీ నేతలు చెప్పారు.
హెచ్‌సీయూ భూముల వివాదం నేపథ్యంలో యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విశ్వవిద్యాలయ భూములను రక్షించాలంటూ విద్యార్ధులు ఆందోళనలు నిర్వహించారు. వర్సిటీ లోపలికి వెళ్ళేందుకు ఏబీవీపీ, బీజేవైఎం, వామపక్షాల నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకుని వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు.
మరోవైపు, కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించడానికి బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు నిలువరించారు. ఆ క్రమంలో తోపులాట జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీ సందర్శనకు పిలుపునిచ్చిన బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. బంజారాహిల్స్‌లోని మహేశ్వర రెడ్డి నివాసం ముందు పోలీసులు మోహరించారు.
ఇదే వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావుల నివాసాల వద్ద సైతం పోలీసులు మోహరించారు.