ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని మిగతావన్నీ తరవాతేనని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో పింఛన్ల పంపిణీలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. గత ప్రభుత్వం నొక్కిన బటన్లన్నీ కూడా ఇప్పుడిచ్చే పింఛన్లకు సమానమన్నారు. ప్రతి నెలా రూ.2700 కోట్లుపైగా పింఛన్లకు ఖర్చు చేస్తున్నామన్నారు. 64 లక్ష మందికి పింఛన్లు అందిస్తున్నట్లు గుర్తుచేశారు. రెండు నెలలు తీసుకోని వారికి మూడో నెలలో మొత్తం కలిపి పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. గతంలో ఒక నెల పింఛను తీసుకోకపోతే తీసేసేవారని గుర్తుచేశారు.
పేదరికం లేని సమాజమే తన లక్ష్యమన్నారు. కొందరి సంపాదనకన్నా పింఛనే అధికంగా ఉందన్నారు. వికలాంగులకు నెలకు రూ.6 వేలు అందిస్తున్నాం. గత ఏప్రిల్ నుంచే పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పింఛన్లకే ప్రభుత్వం ఏటా రూ.33100 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం తెలిపారు.
అమరావతి రాజధానిని గాడిలో పెట్టామని సీఎం చెప్పారు. పనులు వేగంగా పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం రాజధాని పనులు గాలికి వదిలేసిందని సీఎం ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని పనులు గాడినపడ్డాయన్నారు. నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కుకు రూ.11000 కోట్లు కేంద్రం విడుదల చేసి ఆదుకుందన్నారు. కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కును రక్షించుకుందని చెప్పారు.