పంజాబ్‌కు చెందిన ప్రముఖ పాస్టర్ బజీందర్ సింగ్‌కు 2018 నాటి రేప్ కేసులో మొహాలీ కోర్టు జీవిత ఖైదు విధించింది. 42ఏళ్ళ బజీందర్ సింగ్ యేసూ యేసూ అనే క్రైస్తవ భక్తిగీతంతో బాగా పాపులర్ అయ్యాడు. ఒక యువతిని భయపెట్టి, భౌతికంగా హింసించి, ఆమెను రేప్ చేసిన నేరానికి ఇప్పుడు శిక్ష పడింది.
ఈ కేసు 2018లో జిరక్పూర్ పోలీస్ స్టేషన్లో ఒక మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా రిజిస్టర్ అయింది. ఫిర్యాదులోని వివరాల మేరకు… బజీందర్ సింగ్ తనను విదేశాలకు తీసుకువెడతానని మాట ఇచ్చి ఆమెను ఆకట్టుకున్నాడు. తర్వాత మొహాలీలో సెక్టార్ 63లోని తన నివాసంలో ఆమెను రేప్ చేసి, దాన్ని వీడియో తీసాడు. తన డిమాండ్లకు ఒప్పుకోకపోతే ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించాడు.
బజీందర్ సింగ్‌తో పాటు ఈ కేసులో మరో ఐదుగురు నిందితులు ఉన్నారు. అక్బర్ భట్టి, రాజేష్ చౌధరి, జతీందర్ కుమార్, సితార్ అలీ, సందీప్ పహల్వాన్ అనే ఆ ఐదుగురినీ కోర్టు విడిచిపెట్టేసింది.
ఈ నెల మొదట్లో పాస్టర్ బజీందర్ సింగ్ ఒక మహిళతో వాదిస్తూ, ఆమెను కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. దాన్ని గమనించిన మొహాలీ పోలీసులు దాడి తదితర నేరాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో పాస్టర్ మీద కేసు పెట్టారు. నిజానికి ఆ వీడియో బజీందర్ సింగ్ నివాసంలోని ఒక గదిలో ఫిబ్రవరి 14న సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యం. బాధితురాలితో వాదించి ఆమెను చెత్తబుట్టలోకి తోసేసి చెంప మీద కొట్టాడు.
పాస్టర్ బజీందర్ సింగ్ మీద ఈ యేడాది ఫిబ్రవరి 28న మరో లైంగిక వేధింపుల కేసు కూడా నమోదయింది. 22ఏళ్ళ బాధితురాలి ఆరోపణలన్నీ నిరాధారాలే అంటూ బజీందర్ కొట్టిపడేసాడు. బజీందర్ తనకు అసభ్య సందేశాలు పంపించేవాడనీ, తన క్యాబిన్‌కు ఒంటరిగా రమ్మనే వాడనీ, అవాంఛనీయంగా ప్రవర్తించేవాడనీ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఆరోపణలపై విచారణ జరిపించడానికి ఎస్పీ రూపీందర్ కౌర్ నాయకత్వంలో ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసారు.
బజీందరర్ సింగ్ 2012లో పాస్టర్ వేషం కట్టాడు. స్వస్థత కూటములు, మిరాకిల్ హీలింగ్ పేరుతో ఎలాంటి రోగాన్నయినా తగ్గించేస్తాను అని ప్రచారం చేసుకుంటూ అమాయక ప్రజలను ఆకట్టుకున్నాడు. జలంధర్‌లోని తాజ్‌పూర్‌లో చర్చ్ ఆఫ్ గ్లోరీ పేరుతో చర్చి నిర్మించాడు. మొహాలీలో మాజ్రీ ప్రాంతంలో మరొక చర్చి నిర్మించే పనిలో ఉన్నాడు. అతనికి ‘ప్రొఫెట్ బజీందర్ సింగ్’ అనే యూట్యూబ్ ఛానెల్ ఉంది. అందులోలో అతను ప్రసారం చేసే పలురకాల కార్యక్రమాలు ప్రసారం చేస్తూ ఉటారు. ఆ ఛానెల్‌కి 37.5 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు.