దేశంలో త్రిభాషా సూత్రంపై వివాదం నెలకొన్న వేళ యూపీ సీఎం ఆదిత్యనాథ్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీ బడుల్లో తెలుగు, కన్నడ, మరాఠీ, తమిళం, బెంగాలీ కూడా నేర్పిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ రాజకీయ ప్రయోజనాల కోసం హిందీపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కువ అవకాశాలను అందిపుచ్చుకునేందుకే పలు భాషలు విద్యార్థులకు నేర్పిస్తున్నామన్నారు. పలు భాషలు నేర్పించడం వల్ల యూపీ చిన్నదై పోదంటూ యోగి చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి.
యూపీలో ఎంత మంది ఉపాధ్యాయులు తమిళం నేర్పాస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ప్రశ్నించారు. తమిళనాడులో విద్యార్థులపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని విమర్శించారు. తమిళనాడుకు వచ్చే కూలీలు తమిళం నేర్చుకుని వస్తున్నారా? వారు స్థానికులపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్, యూపీ సీఎం యోగీల మధ్య త్రిభాషా విధానంపై వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జాతీయ విద్యా విధానంలో భాగంగా వచ్చిన త్రిభాషా సూత్రం రాజకీయ దుమారం రేపుతోంది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థి రెండు జాతీయ భాషలను తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే హిందీని బలవంతగా తమపై రుద్దుతోందని తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శలు చేస్తున్నారు.