రాబోయే మూడు నెలల పాటు ఎండలు మండుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వడగాలులు నాలుగు రోజులు అదనంగా ఉంటాయని ఐఎండి అధిపతి మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. దేశంలోని మధ్య, తూర్పు, వాయువ్య రాష్ట్రాల్లో ఎక్కువ రోజులు వడగాలులు వీస్తాయని మహాపాత్ర స్పష్టం చేశారు.
సాధారణంగా మూడు నెలల్లో నాలుగు నుంచి ఏడు రోజులు వడగాలులు వీస్తుంటాయి, ఏపీ, తెలంగాణ కర్ణాటక, రాజస్థాన్, యూపీ, హరియాణా, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువగా వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ మాసంలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు.
అనంతపురంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు, కడప జిల్లా మినహా మిగిలిన జిల్లాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని ఐఎండి తెలిపింది. పార్వతీపురం మన్యం జిల్లాలో 10 మండగాలు, శ్రీకాకుళలో 6, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3,విజయనగరంలో 6, తూర్పుగోదావరి జిల్లాలో ఒక మండలంలో వడగాలులు వీచే ప్రమాద ముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ వెల్లడించారు.
సోమవారం నాడు నంద్యాల జిల్లా గోస్పాడులో 40.3, కర్నూలు జిల్లా కమ్మరచేడులో 40.2, అనంతపురం జిల్లాలో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉక్కపోత, వేడి నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది.
మంగళవారం నుంచి శుక్రవారం వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గతాయని ఐఎండి ప్రకటించింది. ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి ఒక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.