ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ ఐఐఐటీలో చదువుకుంటున్న తెలుగు విద్యార్ధుల్లో ఇద్దరు చనిపోయారు. ఒక విద్యార్ధి గుండెపోటుతో మరణించాడు. మరొక విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు.
అలహాబాద్ ఐఐఐటీ అధికారులు, స్థానిక పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి…
తెలంగాణ రంగారెడ్డి జిల్లా మాడుగుల గ్రామానికి చెందిన అఖిల్ (21) అనే విద్యార్ధి ఇంజనీరింగ్ ఫస్టియర్ విద్యార్ధి. శనివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో తన గదిలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. అధికారులు సమాచారం అందించడంతో బాబు తల్లిదండ్రులు అలహాబాద్ వెళ్ళారు.
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన కృష్ణ, స్వర్ణలత దంపతులు నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సత్యనారాయణ పురం గ్రామంలో హోటల్ నిర్వహిస్తున్నారు. వారి పెద్దకొడుకు మాదాల రాహుల్ చైతన్య (21) దివ్యాంగుడు. గతేడాది ఆగస్టులో అలహాబాద్ ఐఐఐటీలో చేరాడు. శనివారం అర్ధరాత్రి తర్వాత హాస్టల్ ఐదో అంతస్తుకు వెళ్ళి అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
రాహుల్ చైతన్య ఆత్మహత్యకు వేర్వేరు కారణాలు చెబుతున్నారు. ఇటీవలి సెమిస్టర్ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయినందుకు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు భావిస్తున్నారు. తన సన్నిహిత మిత్రుడైన అఖిల్ చనిపోవడాన్ని తట్టుకోలేక చనిపోయాడని మరికొందరు చెబుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లనే తమ పిల్లలు చనిపోయారంటూ వారి తల్లిదండ్రులు వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించారు. వారి మరణాలపై విచారణ జరిపేందుకు కమిటీ వేసామని, బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామనీ అధికారులు హామీ ఇచ్చారు. దాంతో బాధిత కుటుంబాలు ఆందోళనలు విరమించాయి.