కేరళ రాష్ట్రపు ఎంపీలు అందరూ వక్ఫ్ సవరణ బిల్లు 2024కు అనుకూలంగా ఓటు వేయాలని కేరళ క్యాథలిక్ బిషప్స్ కౌన్సిల్ (కేసీబీసీ) విజ్ఞప్తి చేసింది. కార్డినల్ బేసెలియోస్ క్లీమిస్ క్యాథలికోస్ బవా, కేసీబీసీ ఉపాధ్యక్షుడు మార్ పోలి కన్నూమక్కారన్, ప్రధాన కార్యదర్శి బిషప్ డాక్టర్ అలెక్స్ వడక్కుంతల ఆ పిటిషన్ మీద సంతకం పెట్టారు.
మునంబం ప్రాంతంలోని ప్రజల సమస్యల చట్టబద్ధమైన పరిష్కారం కోసం కేరళ ఎంపీలు వక్ఫ్ సవరణ బిల్లు 2024కు మద్దతివ్వాలని కేసీబీసీ కోరుతోంది. మునంబం ప్రజలు తమకు తమ పూర్వీకుల నుంచి వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తిని కాపాడుకోడానికి సుమారు ఆరు నెలలుగా సత్యాగ్రహం చేస్తున్నారు. మునంబంలో 600కు పైగా కుటుంబాలకు చెందిన 404 ఎకరాల భూమి ఉంది. వారిలో అత్యధికులు క్రైస్తవులు. ఆ భూమి తమదేనంటూ వక్ఫ్ బోర్డ్ ప్రకటించేసింది. దాంతో అక్కడి ప్రజల్లో ఆందోళన మొదలైంది.
వక్ఫ్ చట్టంలోని అలాంటి అన్యాయమైన, రాజ్యాంగ విరుద్ధమైన అంశాలను తొలగిస్తూ, అవసరమైన సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణల బిల్లును తీసుకొచ్చింది. ఆ బిల్లుకు మద్దతు ఇవ్వాలంటూ కేరళ రాష్ట్రానికి చెందిన ఎంపీలకు కేసీబీసీ విజ్ఞప్తి చేసింది. వక్ఫ్ చట్టంలో ఇప్పుడున్న ప్రొవిజన్ల ప్రకారం వక్ఫ్ బోర్డు ఏ భూమినైనా చూపించి అది తమదే అని చెబితే అదింక వారిదే. నిజమైన యజమానులు తమ హక్కులను తామే, అది కూడా వక్ఫ్ ట్రిబ్యునల్‌లోనే, నిరూపించుకోవాలి. ఆ ట్రిబ్యునల్ తీర్పుమీద న్యాయస్థానానికి వెళ్లేందుకు కూడా వీలు లేదు. ఇంక, వక్ఫ్ ట్రిబ్యునల్‌లో న్యాయాధీశులుగా ఎవరుంటారు, సహజంగా ముస్లిములే ఉంటారు. దాన్ని బట్టి న్యాయం ఎవరికి జరుగుతుందో ఇట్టే అర్ధమైపోతుంది.
మునంబంలో ప్రజలు తమకు తరతరాలుగా వారసత్వంగా వచ్చిన ఆస్తిని ఇన్నాళ్ళూ దర్జాగా అనుభవిస్తున్నారు. అయితే, ఆ భూమిని కొన్ని తరాల క్రితం వారి పూర్వీకులకు ఎవరో విక్రయించారు. కానీ దాన్ని వారికి అమ్మలేదనీ, విరాళం లేదా కానుకగా మాత్రమే ఇచ్చామనీ ఫరూఖ్ కళాశాల ప్రస్తుత యాజమాన్యం తప్పుడుగా ప్రకటించుకుంది. దాని ఆధారంగానే ఆ భూములన్నీ వక్ఫ్ భూములు అని కేరళ వక్ఫ్ బోర్డు ప్రకటించేసింది. అందుకే కేసీబీసీ నాయకులు రంగంలోకి దిగారు. మునంబం ప్రాంత ప్రజలకు చెందిన భూముల గురించి వివాదం రేగినట్లు మరెక్కడా జరగకూడదని వారు కోరుకుంటున్నారు. అందుకే వక్ఫ్ సవరణ చట్టానికి తమ రాష్ట్ర ప్రజాప్రతినిధులు పూర్తి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
‘క్రైస్తవుల భూములను దురాక్రమణ చేయడానికి వక్ఫ్ బోర్డుకు తెగువనిచ్చిన రాజ్యాంగ విరుద్ధమైన, అన్యాయమైన ప్రొవిజన్లను సవరించడానికి అనుకూలంగా, సవరణ బిల్లుకు మద్దతుగా ఓటు వెయ్యాలి’ అని కేరళకు చెందిన ఎంపీలకు రాసిన ఒక లేఖలో కేసీబీసీ అధ్యక్షుడు కార్డినల్ క్లీమిస్ క్యాథలికోస్ విస్పష్టంగా కోరారు.
పరిస్థితులు అనుకూలిస్తే ఈ అంశం మీద ఎంపీలతో నేరుగా చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేసీబీసీ ఉప ప్రధాన కార్యదర్శి ఫాదర్ థామస్ తరయిల్ చెప్పారు. కేసీబీసీ ఏకమొత్తంగా వక్ఫ్ చట్టాలను వ్యతిరేకించడం లేదనీ, అయితే భవిష్యత్తులో మునంబం లాంటి కేసులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నదే తమ మౌలిక లక్ష్యమనీ `ఫాదర్ థామస్ వివరించారు.
కేరళలో మొత్తం 20 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ కూటమిదే మెజారిటీ. ఆ కూటమిలో 14మంది కాంగ్రెస్ ఎంపీలు, 2 ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ ఎంపీలు, 1ఆర్ఎస్పి, 1కేరళ కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎంపీలు ఉన్నారు. వామపక్ష కూటమి ఎల్డీఎఫ్కు కేరళలో ఒకే ఒక ఎంపీ ఉన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే గత ఎన్నికల్లోనే మొదటిసారి ఒక ఎంపీని గెలిపించుకుంది.
ఇంక రాజ్యసభలో కేరళ నుంచి 9మంది ఎంపీలు ఉన్నారు. వారిలో సీపీఎం ఎంపీలు 3, సీపీఐ ఎంపీలు 2, కేరళ కాంగ్రెస్ (ఎం) నుంచి 1… మొత్తం ఆరుగురు ఎంపీలు వామపక్ష కూటమి ఎల్డీఎఫ్లో ఉన్నారు. యూడీఎఫ్‌కు 3 సీట్లున్నాయి. వారిలో ముస్లింలీగ్ ఎంపీలు ఇద్దరు, కాంగ్రెస్ ఎంపీ ఒకరు ఉన్నారు.
వక్ఫ్ బిల్లు విషయంలో కేసీబీసీ జోక్యం కేరళ ఎంపీలకు ప్రత్యక్ష సవాల్‌గా నిలిచింది. భూముల వివాదాల్లో వక్ఫ్ బోర్డు ప్రభావం పెరిగిపోతుండడం మీద ఆ రాష్ట్ర ఎంపీలు ఏమీ తేల్చకుండా ఇన్నాళ్ళూ గడిపేసారు. ఇప్పుడు కేరళ ఎంపీలు స్పష్టమైన వైఖరి అవలంబించాల్సిందే అంటూ కేసీబీసీ, చర్చి డిమాండ్ చేస్తున్నాయి. తమ హక్కులకు విఘాతం కలిగించకుండా ఉండేలా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి.
కేరళలోని క్రైస్తవ మెజారిటీ నియోజకవర్గాల మీద కేసీబీసీ ప్రభావాన్ని కొట్టిపారేయలేం. వక్ఫ్ అంశం మీద వారు తీసుకొనబోయే వైఖరి, వచ్చే యేడాది జరగబోయే ఎన్నికల్లో ఓటర్ల సెంటిమెంటును కచ్చితంగా ప్రభావితం చేస్తుంది. అయితే ముస్లిం బుజ్జగింపు రాజకీయాలు చేసే కాంగ్రెస్, వామపక్షాలు తదితర పార్టీలు దానికి ఒప్పుకునే అవకాశం కనుచూపు మేరలో లేదు. వక్ఫ్ బిల్లును ఒప్పుకునేది లేదంటూ ఆ పార్టీ జాతీయ అధిష్ఠానం ఇప్పటికే తేల్చి చెప్పేసింది. ఇప్పుడు కేరళలోని ప్రజా ప్రతినిధుల ముందు రెండే దారులున్నాయి. క్రైస్తవుల విజ్ఞప్తికి ఒప్పుకోవడమా, హైకమాండ్ ఆదేశాలను అనుసరించడమా? ఇప్పుడు వారి పరిస్థితి కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు తయారైంది.