ఏలూరు జిల్లా జైలులో దారుణం జరిగింది. భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న రిమాండ్ ఖైదీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
జీలుగుమిల్లి మండలం తాటాకులగూడేనికి చెందిన గంధం బోసుబాబుపై ఈ నెల 17న దాడి జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు,బోసుబాబు భార్య శాంతకుమారి, ఆమె ప్రియుడు సొంగా గోపాలరావు ను అరెస్టు చేశారు. న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఇద్దరిని జిల్లా జైలుకు తరలించారు.శాంతకుమారి(31)ని మహిళా బ్యారక్‌లో ఉంచారు.
ఏలూరు జిల్లా జైలులోని మహిళా బ్యారక్ లో 30 మంది ఖైదీలు ఉండేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శాంతకుమారితో కలిపి ఆరుగురు జైలులో ఉన్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు బ్యారెక్ తెరవగా శాంతకుమారి బాత్ రూముకు వెళ్లి వస్తానని చెప్పింది. టిఫిన్ కోసం ఎంతసేపటికీ రాకపోవడంతో వారు వెళ్లిచూడగా బ్యారక్ కిటికీ చున్నీతో ఉరేసుకుని కనిపించింది.
వెంటనే జైలు సిబ్బంది , ఆమెను అంబులెన్స్ లో సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్ళారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. జైలు సూపరింటెండెంట్ సీహెచ్‌ఆర్‌వీ స్వామి, వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ ఆసుపత్రికి వెళ్ళి ఘటన గురించి ఆరా తీశారు. జైలు అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు, జైలు అధికారుల సమక్షంలో ఆర్‌డీవో అచ్యుత్ అంబరీశ్ ఆధ్వర్యంలో ఆసుపత్రి శవాగారం వద్ద మృతదేహానికి పంచనామా నిర్వహించారు.
తప్పుడు కేసులో తన కుమార్తెను ఇరికించడంతోనే ఆత్మహత్య చేసుకుందని మృతిరాలి తల్లి చెబుతోంది. కుమార్తె చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారని రోదిస్తోంది.
మహిళా బ్యారక్ వద్ద విధుల్లో ఉన్న హెడ్‌వార్డర్ వరలక్ష్మి, వార్డర్ నాగమణిలను సస్పెండ్ చేస్తూ జైలు సూపరింటెండెంట్ సీహెచ్‌ఆర్‌వీ స్వామి ఉత్తర్వులు జారీ చేశారు.