వారసత్వానికి అడ్డువస్తున్నారని చిన్నారులపై కర్కశత్వం
మారుతల్లి దెబ్బలతో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి
తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మరో బాలుడు
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో అమానవీయ ఘటన జరిగింది. ఓ మహిళ అమ్మతనానికే మచ్చ తెచ్చేలా వ్యవహరించింది. ఓ పసిబాలుడు చనిపోయేందుకు కారణమైంది.
పోలీసులు, స్థానికుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడుకు చెందిన కంచర్ల సాగర్ తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. కృష్ణా జిల్లాకు చెందిన అనూషతో 10 ఏళ్ళ కిందట వివాహమైంది. ఈ దంపతులకు తొలి సంతానంగా ఇద్దరు మగ కవలలు జన్మిచ్చారు. రెండో కాన్పులో ఓ పాపకు జన్మనిచ్చిన అనూష ఆ తర్వాత చనిపోయింది. దీంతో చిన్నారిని దత్తత ఇచ్చారు.
సాగర్ కు రెండేళ్ల కిందట గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన లక్ష్మితో రెండో వివాహమైంది. ఎనిమిది నెలల క్రితం లక్ష్మికి పాప జన్మించింది. అప్పటి వరకు కవలలిద్దరినీ బాగానే చూసుకున్న లక్ష్మీ, ఆ తర్వాత వారిని చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది. భర్త కూడా అడ్డుచెప్పకపోవడంతో మరింత రెచ్చిపోయింది.
ఈ నెల 29న చిన్నారులను కొట్టింది. కార్తీక్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆకాశ్ అనే బాలుడిని వేడెక్కిన అట్లపెనం మీద చేతులు కట్టేసి కూర్చోబెట్టడంతో కాలిన గాయాలతో అల్లాడుతున్నాడు. స్థానికులు ఈ విషయంపై దంపతులను నిలదీయగా కొండవీడుకు వెళ్ళిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు కొండవీడు వెళ్ళేసరికి కార్తీక్ చనిపోయాడు. కాలిన గాయాలతో ఉన్న ఆకాశ్‌ను చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.