గతవారం పాస్టర్ ప్రవీణ్ పగడాల రహదారి ప్రమాదంలో మరణించినప్పటి నుంచీ అది హిందువులు చేసిన హత్య అంటూ కొందరు క్రైస్తవ మతబోధకులు రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న ఆదివారం పోలీసులు ఆ ప్రమాదం గురించిన పూర్తి వివరాలను వెల్లడించారు. రెండుచోట్ల మద్యం సేవించి, ఆ స్థితిలోనే జాతీయ రహదారి మీద టూవీలర్ డ్రైవింగ్ చేసుకుంటూ ప్రమాదానికి గురయ్యాడని స్పష్టమైంది. అయినప్పటికీ క్రైస్తవ మతబోధకులు ఇంకా దాన్ని హత్యగానే ప్రచారం చేస్తున్నారు. హిందువులే హత్య చేసారంటూ సామాన్య క్రైస్తవుల మెదళ్ళలోకి విషం ఎక్కిస్తున్నారు. తద్వారా మతద్వేషాలను రెచ్చగొట్టే పనిని కొనసాగిస్తున్నారు.
పోలీసుల వివరణ ప్రకారం… ప్రవీణ్ పగడాల మార్చి 24 ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి టూవీలర్ మీద రాజమండ్రికి బయల్దేరాడు. మధ్యాహ్నం కోదాడలో మద్యం కొనుగోలు చేసారు. మద్యం దుకాణంలో రూ.650 ఫోన్‌పే చేసారు. ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించే ముందే ప్రవీణ్ మద్యం తాగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కంచికచర్ల – పరిటాల మధ్యలో బ్యాలెన్స్ తప్పి ఒకసారి పడిపోయాడు. అప్పుడే బులెట్ బండి హెడ్‌లైట్ పగిలిపోయింది. చేతులకు గాయాలయ్యాయి. విజయవాడ శివార్లలోని గొల్లపూడిలో సాయంత్రం 4.45 గంటలకు పెట్రోల్ బంక్ దగ్గర ఆగాడు. అక్కడ అతను కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నందున, చేతి సైగలతో పెట్రోల్ కొట్టించాడు. అక్కడ కూడా ఫోన్‌పే ద్వారా డబ్బులు చెల్లించాడు. ప్రవీణ్ బండి హెడ్‌లైట్ పగిలిపోయి ఉండడం, అతని చేతులకు గాయాలై ఉండడాన్ని బంక్ సిబ్బంది గమనించారు కూడా.
సాయంత్రం 5.20 సమయానికి విజయవాడ రామవరప్పాడు రింగ్‌రోడ్‌కు కొద్దిగా ముందు హైవే మీద ప్రవీణ్ మరోసారి పడిపోయాడు. అతన్ని గమనించిన కొందరు ఆటోడ్రైవర్లు దగ్గర్లో ఉన్న ట్రాఫిక్ ఎస్సైకి సమాచారం ఇచ్చారు. ఆటో డ్రైవర్లు, ఎస్సై కలిసి ప్రవీణ్‌ను రోడ్డు వారగా ఉన్న పచ్చికలో కూచోబెట్టారు. ముఖం కడుక్కుని, తాగడానికి ప్రవీణ్‌కు ట్రాఫిక్ ఎస్సై సుబ్బారావు మంచినీళ్ళు ఇచ్చారు. ప్రవీణ్ అక్కడ సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8.30 వరకూ నిద్రపోయాడు. నిద్ర లేచాక అతనికి ఎస్సై కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం నేరమని చెప్పారు. దగ్గర్లో ఉన్న టీస్టాల్‌కు తీసుకువెళ్ళి టీ ఇప్పించారు. తర్వాత ప్రవీణ్ మళ్ళీ ప్రయాణం కొనసాగించారు. ఆ పరిస్థితిలో డ్రైవింగ్ వద్దంటూ ఎస్సై వారించినా ప్రవీణ్ వినలేదు.
అంత జరిగిన తర్వాత కూడా ప్రవీణ్ మళ్ళీ ఏలూరు దగ్గర మద్యం కొనుగోలు చేసారు. రూ.350 ఫోన్‌పే ద్వారా చెల్లించారు. ఆ క్రమంలోనే రాజమండ్రి శివార్లలోని కొంతమూరు దగ్గర సుమారు అర్ధరాత్రి ప్రాంతంలో మరోసారి పడిపోయి ప్రాణాలు కోల్పోయారు.
ప్రవీణ్ మృతదేహం దగ్గర నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో యూపీఐ ట్రాన్సాక్షన్స్‌ను తనిఖీ చేయగా రెండు చోట్ల మద్యం కొనుగోలు చేసినట్లు తెలిసింది. దాన్నిబట్టి ఆ రెండు దుకాణాలకూ వెళ్ళి అక్కడి సీసీటీవీ ఫుటేజ్ సేకరించారు. ఆ క్రమంలోనే కోదాడకు ముందు నుంచీ ప్రమాదం జరిగిన సంఘటనా స్థలం వరకూ సీసీటీవీ రికార్డింగ్స్ అన్నింటినీ సేకరించారు. విజయవాడ రామవరప్పాడు దగ్గర ట్రాఫిక్ ఎస్సై ప్రవీణ్‌ను గమనించినప్పుడు అతనికి ఈ వ్యక్తి క్రైస్తవ సమాజంలో ప్రముఖుడైన ఒక పాస్టర్ అన్న సంగతి తెలియదు. బండి హెడ్‌లైట్ పగిలిపోయి ఉండడం, సేఫ్టీ రాడ్లు వంగిపోయి ఉండడం, హెల్మెట్ సొట్టలు పడడం, ప్రవీణ్ చేతుల మీద గాయాలు ఉండడం అవన్నీ గమనించిన ఎస్సై ఆ దృశ్యాలను ఫొటోలు, వీడియోలు తీసారు. ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని, హెల్మెట్ ధరించడం గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఫొటోలు, వీడియోలూ తీసాననీ ఉన్నతాధికారులకు ఎస్సై సుబ్బారావు వివరించారు.
అయితే, పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రమాదవశాత్తు మరణించడాన్ని హిందువులు చేసిన హత్య అంటూ కుట్ర ప్రకారం ప్రచారం చేస్తున్న కొందరు క్రైస్తవ మతబోధకులు, కొందరు హిందూవిద్వేష క్రైస్తవ ప్రముఖులు పోలీసుల దర్యాప్తులో వెల్లడైన నిజాలను సైతం అబద్ధాలంటూ ప్రచారం చేస్తున్నారు. పోలీసులు తీసిన ఫొటోలు, వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్‌ను మీడియాకు పోలీసులే అందజేసారు. కానీ అవన్నీ ఎడిటింగ్ చేసిన తప్పుడు ఫొటోలు, వీడియోలు అని దుష్ప్రచారం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. చొక్కా రంగు తేడాగా ఉందని, ప్యాంటు వేరేలా ఉందని, అసలా ఫొటోల్లోని వ్యక్తి ప్రవీణే కాదనీ, కొందరు హిందువులే ప్రవీణ్‌తో బలవంతంగా ఆ పనులన్నీ చేయించారనీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగిస్తున్నారు. ప్రవీణ్‌ను పట్టుకున్న ట్రాఫిక్ ఎస్సై, అతని మీద ఎందుకు డ్రంకెన్ డ్రైవ్ నమోదు చేయలేదంటూ నిలదీస్తున్నారు.
ఈ వ్యవహారంలో ఇప్పుడు పోలీసులు ఎలా ప్రవర్తిస్తారో చూడాల్సి ఉంది. ప్రవీణ్ శవాన్ని గుర్తుపట్టిన రోజునుంచీ అది హిందువులు చేయించిన హత్య అని రంకెలు వేస్తూ, సామాన్య క్రైస్తవుల్లో హిందువుల పట్ల విద్వేషాన్ని రగిల్చిన క్రైస్తవ మతబోధకులు, రాజకీయ నాయకుల మీద చర్యలు తీసుకుంటారా? ప్రవీణ్‌ను హిందువులే హత్య చేసారంటూ మీడియా కెమెరాల ముందు వీరంగం వేసి తప్పుడు సమాచారం వ్యాపింపజేసి సమాజంలో అశాంతిని కలుగజేసి హిందువుల మీద ద్వేషాన్ని రగిల్చిన వారిమీద ఏం చర్యలు తీసుకుంటారు? అసలు, ప్రవీణ్ మద్యం సేవించి డ్రైవింగ్ చేసాడని, ఆ క్రమంలోనే ప్రమాదానికి గురై చనిపోయాడనీ పోలీసులు ప్రకటించగలరా? పోలీసులు సుదీర్ఘంగా చేసిన దర్యాప్తును సైతం తప్పులుగా ప్రచారం చేస్తున్న వారి మీద చర్యలు ఏమైనా తీసుకుంటారా? అన్నవి తెలియాల్సి ఉంది.