విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ ఉదయం శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామివార్లకు, పరివార దేవతలకు స్నపనాభిషేకం నిర్వహించారు. ఆ కార్యక్రమం పూర్తయిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
పుష్పార్చన:
వసంత నవరాత్రుల సందర్బంగా దేవస్థానంలో నటరాజ స్వామి వారి ఆలయం పక్కన నిర్మించిన పూజా మండపంలో ఉదయం పుష్పార్చన జరిగింది. నవరాత్రుల్లో మొదటి రోజైన ఉగాది సందర్బంగా అమ్మవారికి మల్లెపూలు, మరువంతో అర్చన జరిగింది. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారి పుష్పార్చనను చూసి తరించారు.
పంచాంగ శ్రవణం:
మధ్యాహ్నం 3 గంటల నుండి ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమం పుష్పార్చన ప్రదేశంలో జరిగింది. దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి చల్లా శ్రీనివాస శర్మ పంచాంగ వివరాలు వెల్లడించారు. ఈ సంవత్సరం రాజ్యాధిపతి, మంత్రి, సేనాధిపతి అనుకూలురు అవడం వలన అమ్మవారి అనుగ్రహంతో సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, అభివృద్ధి బాగుంటుందని, ధార్మిక కార్యకలాపాలు విస్తృతంగా జరుగుతాయని వివరించారు.
పంచాగ శ్రవణ కార్యక్రమం పూర్తయిన తర్వాత పంచాంగకర్త శ్రీనివాస శర్మను ఆలయ కార్యనిర్వహణాధికారి కె. రామచంద్ర మోహన్ సత్కరించారు. ఆ కార్యక్రమంలో స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా వెండి రధోత్సవం:
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది, వసంత నవరాత్రుల ప్రారంభం సందర్బంగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఇంద్రకీలాద్రి కొండ పైనుండి ఘాట్ రోడ్ మీదుగా కామధేను అమ్మవారి ఆలయం మీదుగా – వెండి రధోత్సవం ప్రారంభమైంది. కార్యనిర్వహణాధికారి కె. రామచంద్ర మోహన్ కొబ్బరికాయ కొట్టి, పూజలు నిర్వహించారు.
శ్రీ కనకదుర్గా మల్లేశ్వరులు కొలువైన రధం బ్రాహ్మణ వీధి మీదుగా వన్ టౌన్ పుర వీధులలో విహరించింది. తప్పెట్లు, కోలాట నృత్యాలు, తాళం భజనలు మధ్య దుర్గా నామ స్మరణ తో రధోత్సవం కన్నుల పండువగా సాగింది.