రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వందేళ్ళ సుదీర్ఘ ప్రయాణాన్ని భారతీయ సమాజం చూసిందనీ, సంఘంలోని స్వయంసేవకులను పరీక్షించి, ఆమోదించిందనీ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. మహారాష్ట్ర నాగపూర్‌లో ‘మాధవ నేత్రాలయ ప్రీమియం సెంటర్’ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు మోహన్ భాగవత్ కూడా పాల్గొన్నారు.
‘‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రస్థానం వందేళ్ళది. సంఘ స్వయంసేవకుల ఈ సుదీర్ఘ ప్రస్థానాన్ని సమాజం చూసింది, పరీక్షించింది, ఆమోదించింది. అందుకే ఒక సానుకూల పరిస్థితి ఉంది. అవరోధాలు తొలగించబడ్డాయి. స్వయంసేవకులు పురోగమిస్తున్నారు’’ అని మోహన్ భాగవత్ అన్నారు.
‘‘మనం ఒక గంట సొంత అభివృద్ధి కోసం పాటుపడితే, సమాజ సంక్షేమం కోసం 23 గంటలు పాటుపడాలి. అది మా దృష్టి. ఆ నియమానికి లోబడే మా ప్రయత్నాలన్నీ ఉంటాయి’’ అని ఆర్ఎస్ఎస్ తత్వం గురించి మోహన్ భాగవత్ వివరించారు. ‘‘స్వయంసేవకులు తమ గురించి ఏమీ అడగరు. వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు, అంతే. ఈ సుదీర్ఘ ప్రయాణంలో సంఘ స్వయంసేవకులు చేసిన పనిని ఈ దేశం చూసింది’’ అని ఆరెస్సెస్ సర్‌సంఘచాలక్ అన్నారు.