భారతదేశపు అజరామరమైన సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆధునిక అక్షయ వటవృక్షం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. వివిధ రంగాల్లో సంఘ్ అందిస్తున్న నిస్వార్థ సేవలను మోదీ కొనియాడారు. జాతి నిర్మాణంలో, సమాజ సేవలో, సంస్కృతీ పరిరక్షణలో ఆరెస్సెస్ పోషిస్తున్న పాత్రను ప్రశంసించారు.
మోదీ తన నాగపూర్ పర్యటనలో భాగంగా డాక్టర్ హెడ్గేవార్ స్మృతిమందిరంలో ఆరెస్సెస్ వ్యవస్థాపకులు కేశవ బలీరాం హెడ్గేవార్‌కు, రెండవ సర్‌సంఘచాలక్ మాధవ సదాశివ గోళ్వాల్కర్‌కూ నివాళులు అర్పించారు. గత వంద సంవత్సరాలుగా దేశానికి సంఘం అందిస్తున్న సేవలను స్మరించుకున్నారు.
‘మాధవ నేత్రాలయ ప్రీమియమ్ సెంటర్’ శంకుస్థాపన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ ‘‘వందేళ్ళ క్రితం బీజ రూపంగా మొదలైన ఆలోచనలు ఇప్పుడు ప్రపంచం ముందు వటవృక్షంలా ఎదిగాయి. సిద్ధాంతాలు, నియమాలు అనే ఎత్తులకు పెరిగాయి. కోట్లాది స్వయంసేవకులే ఆ మహావృక్షానికి కొమ్మలు. ఆరెస్సెస్ మామూలు మర్రి చెట్టు కాదు, భారతదేశపు అజరామరమైన సంస్కృతికి నిదర్శనమైన ఆధునిక అక్షయ వటవృక్షం’’ అని వ్యాఖ్యానించారు.
‘‘మాధవ నేత్రాలయ దశాబ్దాలుగా లక్షలాది ప్రజలకు వైద్యసేవలు అందిస్తోంది. గురూజీ గోళ్వాల్కర్ దార్శనికతకు నిదర్శనంగా నిలుస్తోంది’’ అని తలచుకున్నారు.
ప్రధాని మోదీ ఇవాళ భారతదేశంలో వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో జరుపుకుంటున్న సంప్రదాయిక నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసారు. మన ఉగాది పండుగనే మహారాష్ట్రులు గుడీ పడ్వా అని జరుపుకుంటారు. అలా వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో వ్యవహరించే ఉగాది పండుగ సందర్భంగా భారతీయులు అందరికీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘దీక్షా భూమి’ దగ్గర భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేద్కర్‌కు నివాళులు అర్పించారు. ఆయన ప్రతిపాదించిన సమానత్వం, సామాజిక న్యాయం అనే నియమాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నరేంద్ర మదీ తమ ప్రభుత్వం దేశ పౌరులకు, ప్రత్యేకించి నిరుపేదలకు ఉత్తమమైన వైద్య సదుపాయాలు కల్పించడానికి అంకితభావంతో పనిచేస్తోందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది ప్రజలకు ఉచిత వైద్య సహాయం అందిస్తున్న సంగతిని గుర్తు చేసారు. ‘‘ఈ దేశ పౌరులు అందరికీ మెరుగైన వైద్య సౌకర్యాలు అందజేయడం మా బాధ్యత. ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది ప్రజలకు ఉచితంగా వైద్యం చేస్తున్నాం. వేలాది జన ఔషధీ కేంద్రాల ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు కావలసిన మందులను నామమాత్రపు ధరలకే అందిస్తున్నామన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో వైద్యసేవల రంగం గణనీయంగా విస్తరించిందని మోదీ చెప్పుకొచ్చారు. భారతదేశంలో ఎయిమ్స్ సంస్థలు, వైద్య కళాశాలలూ పెద్దసంఖ్యలో పెరిగాయన్నారు. ‘‘మేము వైద్య కళాశాలల సంఖ్యను రెట్టింపు చేసాం. సేవలు అందించగల ఎయిమ్స్ సంస్థలు మూడురెట్లు పెరిగాయి. ఇంక మెడికల్ సీట్లు కూడా రెట్టింపు అయ్యాయి. మా లక్ష్యం ఒకటే.. సమాజానికి సేవ చేయడమే. నిపుణులైన వైద్యులను ప్రజలకు అందుబాటులో ఉంచి, వారితో సేవలు చేయించడమే మా లక్ష్యం. మేమింకో సాహసోపేతమైన అడుగు వేసాం. వైద్యవిద్యను విద్యార్ధులకు వారి మాతృభాషలో అందిస్తాం. దానివల్ల వెనుకబడిన వర్గాలలోని పిల్లలు కూడా ధైర్యంగా వైద్యవిద్యను కెరీర్‌గా ఎంచుకోగలుగుతారు’’ అని మోదీ చెప్పారు.
మాధవ నేత్రాలయ ప్రీమియం సెంటర్:
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ‘మాధవ నేత్రాలయ ప్రీమియం సెంటర్’కు శంకుస్థాపన చేసారు. నాగపూర్‌లో ఇప్పటికే ఉన్న మాధవ నేత్రాలయ ఐ ఇనిస్టిట్యూట్ అండ్ రిసెర్చ్ సెంటర్‌కు విస్తరణ రూపం అది. ఆ కార్యక్రమంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు.
మాధవ నేత్రాలయ అనేది 2014లో ప్రారంభించిన ప్రీమియర్ సూపర్ స్పెషాలిటీ ఆఫ్తాల్మిక్ కేర్ ఫెసిలిటీ. ఆరెస్సెస్ రెండో సర్‌సంఘచాలక్‌గా పనిచేసిన మాధవరావు సదాశివరావు గోళ్వాల్కర్ స్మతిచిహ్నంగా స్థాపించారు. ఇప్పుడీ కొత్త ప్రాజెక్టులో 250 పడకల ఆసుపత్రి, 14 ఓపీ విభాగాలు, 14 మోడ్యులర్ ఆపరేషన్ థియేటర్లూ ఉంటాయి. నామమాత్రపు ఖర్చుతో అంతర్జాతీయ స్థాయి నేత్ర వైద్యం అందిస్తారు.
ఆ ఆస్పత్రికి శంకుస్థాపన సందర్భంగా మోదీ మాట్లాడుతూ సమాజంలోని అన్నివర్గాల వారికీ మెరుగైన, నాణ్యమైన వైద్య సౌకర్యాలను తక్కువ ధరలకే అందజేయాలనే లక్ష్యానికి కట్టుబడి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. అదే సమయంలో ఇటువంటి సేవాదృక్పథం కలిగిన సంస్థలు కూడా అవే లక్ష్యాలకు పనిచేయడం దేశపు సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.