ఇవాళ ఉగాది పర్వదినం మాత్రమే కాదు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ బలీరాం హెడ్గేవార్ జయంతి కూడా. ఆ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మహారాష్ట్ర నాగపూర్‌లోని ‘స్మృతి మందిర్’ను సందర్శించారు.
ఆ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆర్ఎస్ఎస్ సర్‌సంఘచాలక్ మోహన్ భాగవత్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, తదితరులు పాల్గొన్నారు.
తన సందర్శన గురించి మోదీ ఎక్స్ సామాజిక మాధ్యమంలో వివరించారు. ‘‘నాగపూర్‌లోని స్మృతి మందిరాన్ని సందర్శించడం గొప్ప అనుభవం. ఇవాళ ఉగాది పర్వదినం, పరమపూజ్య డాక్టర్ సాహెబ్ జయంతి కూడా కావడం ఈ పర్యటనను మరింత ప్రత్యేకం చేసింది’’ అని వెల్లడించారు.
తన జీవితం మీద డాక్టర్ హెడ్గేవార్, గురూజీ గోళ్వాల్కర్ ప్రభావం గురించి మోదీ వివరించారు. ‘‘పరమపూజ్య డాక్టర్ సాహెబ్, పూజ్య గురూజీ ఆలోచనల నుంచి నాలాంటి అసంఖ్యాక ప్రజలు ప్రేరణనూ, శక్తినీ పొందారు. ఆ ఇద్దరు మహానుభావులూ శక్తివంతమైన, సమృద్ధమైన, సాంస్కృతిక స్వాభిమానం కలిగిన భారతదేశాన్ని సంభావించారు. వారికి నివాళులు అర్పించే అవకాశం కలగడం గొప్ప గౌరవం’’ అన్నారు.
నాగపూర్‌లో ప్రధానమంత్రికి ఘన స్వాగతం లభించింది. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులే తదితరులు ఆయనకు విమానాశ్రయం దగ్గర స్వాగతం పలికారు.
డాక్టర్జీకి నివాళులు అర్పించిన తర్వాత స్మృతిమందిరం దగ్గర విజిటర్స్ బుక్‌లో ప్రధానమంత్రి మోదీ తన సందేశం రాసి సంతకం చేసారు. ‘‘పరమ పూజనీయ హెడ్గేవార్‌జీ, పూజనీయ గురూజీలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ స్మృతిమందిరానికి రావడం, వారి స్మృతులను తలచుకోవడం గొప్ప అనుభూతి. భారత సంస్కృతికి, జాతీయతావాదానికీ, సంఘ విలువలకూ అంకితం చేసిన ఈ ప్రదేశం మనలను అందరినీ దేశ సేవలో ముందుకు నడిచేలా ప్రేరణ కలిగిస్తుంది. సంఘానికి బలమైన పునాదులైన ఈ ఇద్దరు మహానుభావుల స్మృతి కేంద్రమైన ఈ ప్రదేశం దేశ సేవకు అంకితమైన లక్షలాది స్వయంసేవకులకు శక్తినిచ్చే కేంద్రం’’ అని మోదీ తన సందేశంలో రాసారు.
ప్రధానమంత్రి నాగపూర్ పర్యటనలో ‘దీక్షాభూమి’ని కూడా సందర్శించారు, బాబా సాహెబ్ అంబేద్కర్‌కు నివాళులర్పించారు.
నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయినప్పటి నుంచీ ఆయనకూ, మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ నేతలకూ మధ్య దూరం పెరిగిందంటూ ప్రచారాలు ఊపందుకున్నాయి. మోదీ ఆర్ఎస్ఎస్‌నూ, దాని రాజకీయ విభాగం బీజేపీనీ మించిపోయారనీ, వ్యక్తికేంద్రంగా మారిపోయారనీ, అది ఆర్ఎస్ఎస్‌కు నచ్చడం లేదనీ వ్యాఖ్యానాలు చేయడం అలవాటుగా మారిపోయింది. మోహన్ భాగవత్ ఏ వ్యాఖ్యలు చేసినా వాటిని నరేంద్ర మోదీకి ముడిపెట్టి దుష్ప్రచారం చేయడం ఆనవాయితీ అయిపోయింది. మరీ ముఖ్యంగా గత యేడాది కాలంగా ఇలాంటి ప్రచారం బాగా పెరిగిపోయింది. మోదీ సంఘ్ ప్రధాన కార్యాలయానికి చాలాకాలంగా వెళ్ళకపోవడాన్ని కూడా అలాంటి అహంభావానికి నిదర్శనంగా చూపుతూ వచ్చారు. అలాంటి తరుణంలో సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్జీ జయంతి, ఉగాది పర్వదినం సందర్భంగా నాగపూర్‌లోని సంఘ్ ప్రధాన కార్యాలయాన్ని మోదీ సందర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది.