రాష్ట్ర రహదారుల అభివృద్ధిలో ప్రైవేటు పెట్టుబడులు ప్రోత్సహించేందుకు పీపీపీ పద్దతిలో 10 వేలకుపైగా కి.మీ రోడ్లను గుర్తించారు. ఇక నుంచి రాష్ట్రంలో కనీసం 20 కి.మీ పైగా ఉన్న రహదారులను పీపీపీ పద్దతిలో నిర్మిస్తారు. ఇందుకు అవసరమైన డీపీఆర్‌లు సిద్దం చేసేందుకు ప్రభుత్వం రూ.31 కోట్లు విడుదల చేసింది.
ముందుగా రాష్ట్ర రహదారులను మూడు విభాగాలుగా విభజించారు. కనీసం 20.కి.మీ పైగా ఉండే రహదారులనే పీపీపీ పద్దతిలో నిర్మిస్తారు. 20 నుంచి 40 కి.మీ, 40 నుంచి 80, 80 కి.మీ పైగా ఉన్న రహదారులను గుర్తించి ఫీజబులిటీ రిపోర్టు ప్రకారం వయబిలిటీ గ్యాప్ నిధులను కేంద్రం నుంచి గుత్తేదారులకు అందిస్తారు. ఈ ప్రక్రియ డిసెంబరు నాటికి పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు పీపీపీ పద్దతిలో రహదారులను నిర్మిస్తున్నాయి. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. టోల్ గేట్లు పెట్టడం వల్ల వాహనదారుల నుంచి గుత్తేదారులు టోల్ వసూలు చేయనున్నారు.
ముందుగా రద్దీ అధికంగా ఉండే రహదారులను పీపీపీ పద్దతిలో నిర్మిస్తారు. అంతగా రద్దీలేని రహదారులను ప్రభుత్వమే నిర్మిస్తుంది. రాష్ట్ర రహదారులు అధ్వానంగా తయారు కావడంతో ప్రజలతోపాటు పారిశ్రామిక రంగం అభివృద్దిపై ప్రభావం చూపుతోంది. జాతీయ రహదారులతోపాటు, రాష్ట్ర రహదారులు కూడా చక్కగా ఉంటే పెట్టుబడులు వేగంగా పెరిగే అవకాశముంది. దీనిపై పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారులు 20 కి.మీ పైగా ఉన్న రహదారులను రెండు, నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు.