కాలం కాటు వేసింది. రెండున్నర దశాబ్దాల కష్టానికి ఫలితం దక్కింది కానీ మనిషి మాత్రం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళితే అనకాపల్లి జిల్లా మాకవరపాలెంకు చెందిన జడ్పీటీసీ మాజీ సభ్యుడు రుత్తుల శేషుకుమార్ తెలుగుదేశం పార్టీలో రెండున్న దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు. మండల పార్టీ అధ్యక్షుడిగా, మాజీ జడ్పీటీసీగా పనిచేశారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధిష్ఠానం, అనకాపల్లి మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవి ప్రకటించింది.
గత కొంత కాలంగా కాలేయ సమస్యతో బాధ పడుతోన్న శేషుకుమార్ విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పదవి ప్రకటించే సమయానికి ఆయన ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నారు.తెలుగుదేశం పార్టీ శనివారం మార్కెట్ యార్డు ఛైర్మన్ల పదవులు ప్రకటించింది. అప్పటికి కొద్ది నిమిషాల ముందే శేషుకుమార్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది. పదవి దక్కిన వార్త శేషుకుమార్ చెవిన పడకముందే ఆయన కాలం చేశారు.