వరుస భూకంపాలు మయన్మార్‌ను కోలుకోలేని దెబ్బతీశాయి. శుక్రవారం సంభవించిన భూకంపంలో 1644 మంది చనిపోయారు. వేలాది మంది ఆచూకీ లభించడం లేదు. 2500 మందికిపైగా గాయపడ్డారు. రాజధాని నేపిడా, మాండలే నగరాల్లో భూకంపం విధ్వంసం సృష్టించింది. మయన్మార్ సైనిక పాలనపై తిరుగుబాటుదారులు దాడులకు దిగడంతో కొన్ని ప్రాంతాల్లో సహాయక చర్యలకు కూడా ఆటంకం కలుగుతోంది. ప్రపంచ దేశాలు మయన్మార్‌కు అండగా నిలిచాయి. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో భారత్ సహాయ సామాగ్రితోపాటు, 80 మంది సిబ్బందితో కూడా తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేసింది.
మయన్మార్‌లో భూకంపం తీవ్ర నష్టం మిగిల్చింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు, పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. రవాణా స్థంభించిపోయింది. పలు ప్రాంతాల్లో విద్యుత్, మంచినీటి సరఫరా నిలిచిపోయింది. భారీ యంత్రాల సాయంతో భవనాల కింద చిక్కుపోయిన వారిని వెలికితీసే సహాయ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి.
మయన్మార్‌కు ఐక్యరాజ్యసమితి ఆపన్న హస్తం అందించింది. 50 లక్షల డాలర్ల తక్షణ సాయం ప్రకటించింది. దక్షిణ కొరియా 20 లక్షల డాలర్లు అందించింది. భారత్ ఇప్పటికే 15 టన్నుల సహాయ సామాగ్రి అందజేసింది. మరో 40 టన్నులు పంపుతోంది. పలు దేశాలు మయన్మార్‌కు సాయం అందిస్తున్నాయి. మృతుల సంఖ్య 5 వేలకుపైగా ఉండవచ్చని అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది.