తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం ఆ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరింది. ఎమ్మెల్యే కొలికపూడి మాకొద్దూ అంటూ వేలాది మంది మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి చేరుకుని నినాదాలు చేశారు. దీంతో అక్కడే ఉన్న పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్ వారిని వారించారు. కొలికపూడి వ్యవహారంపై ఇప్పటికే నలుగురు సభ్యులతో కమిటీ వేసినట్లు చెప్పారు. మాజీ మంత్రి నెట్టెం రఘరాం, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మరో ఇద్దరు నేతలు ఈ వ్యవహారంపై తిరువూరు టీడీపీ నేతలతో చర్చలు జరుపుతున్నారు
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ వద్దకు చేరింది. క్రమశిక్షణా సంఘం నివేదిక ఇచ్చిన తరవాత కొలికపూడిపై నిర్ణయం తీసుకోనున్నారు.
అసలేం జరిగింది
తిరువూరుకు చెందిన మాజీ ఏఎంసీ ఛైర్మన్ రమేశ్ రెడ్డిపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. రుణాలు ఇస్తున్నారంటూ గిరిజన మహిళలను కార్యాలయానికి పిలిచి లైంగికంగా వేధిస్తున్నారంటూ కొందరు కొలికపూడికి ఫిర్యాదు చేశారు. దీంతో రెచ్చిపోయిన కొలికపూడి 48 గంటల్లో రమేశ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే నేనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. దీనిపై అధిష్టానం సీరియస్ అయింది. పార్టీ అధిష్టానాన్ని బెదిరింపులకు దిగడంపై కూడా చర్చ జరుగుతోంది.