మోహన్‌లాల్ నటించిన ‘ఎల్2 : ఎంపురాన్’ సినిమా వివాదంపై నిర్మాత గోకులం గోపాలన్ స్పందంచారు. వివాదానికి దారి తీసిన సన్నివేశాలను తొలగించమని చెప్పానన్నారు.ఎంపురాన్ చిత్రంలోని సన్నివేశం, సంభాషణ ప్రేక్షకుల మనో భావాలను దెబ్బతీసేలా ఉంటే వాటిని వెంటనే మార్చాలని దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు సూచించినట్లు తెలిపారు.
ఒక సినిమా సెన్సార్ అనుమతి పొందిందంటే ఎలాంటి ఇబ్బందులు లేవనే అర్థం కదా అన్నారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాల్లేవన్న గోకులం గోపాలన్, రాజకీయాలను ప్రజలకు సేవ చేసే మార్గంగానే చూస్తామన్నారు.
సినిమా విడుదల తర్వాత మార్పు చేయాల్సి వస్, నిర్మాత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నారు. ప్రస్తుతం 4 వేల థియేటర్లలో సినిమా ఆడుతోందని, మార్పులు చేయాలంటే రూ.40 లక్షల వరకూ ఖర్చు అవుతుందని లెక్కలు చెప్పారు.ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతో సినిమాలు తీయరన్నారు. ప్రేక్షకుల మన్నన కోసమే సినిమాలు తెరకెక్కిసామన్నారు.
గుజరాత్‌లో 2002లో జరిగిన ఓ ఘటనను ఈ సినిమాలో చూపారని అందులో ఓ వర్గంపై మరో వర్గం దాడి చేయడాన్ని చూపారని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపించేలా సన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు.
ఈ చిత్రాన్ని హిందూ వ్యతిరేక అజెండాలో భాగంగా తెరకెక్కించారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. గోద్రా అల్లర్ల నేపథ్యాన్ని ఉపయోగించి హిందూ వ్యతిరేక రాజకీయ అజెండాను ప్రజలు మీద రుద్దే ప్రయత్నాల్లో భాగంగా సినిమా ఉందని పేర్కొంది. హిందువులను కించపరచేలా, జాతీయవాద రాజకీయ భావజాలాలను లక్ష్యంగా సినిమా కథను అల్లారని తూర్పార బట్టింది. హిందూ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఒక మాధ్యమంగా సినిమా ఉందని దుయ్యబట్టింది.వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారంటూ ఆక్షేపించింది.