తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్‌రావు ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు. శ్రవణ్ ఇవాళ తెల్లవారుజామునే దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు.
శ్రవణ్‌రావు ఒక మీడియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణలో సంచలనం సృష్టించిన టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడు. ఆ కేసు 2024 మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదయింది. ఆ మరునాడే శ్రవణ్ దేశం వదిలిపెట్టి పరారయ్యారు. మొదట ఇంగ్లండ్‌లోని లండన్‌కు చేరుకున్నారు. అక్కణ్ణుంచి అమెరికా వెళ్ళిపోయారు. సిట్ విచారణకు హాజరవకుండా ఉండిపోవడంతో ఆయనపై కొద్దిరోజుల క్రితం రెడ్‌కార్నర్ నోటీస్ సైతం జారీ అయింది.
కేసు విచారణకు హాజరు కాక తప్పదని భావించిన శ్రవణ్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నారు. దాన్ని ఈ నెల 2వ తేదీన తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఈ నెల 24న జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. శ్రవణ్ రావు తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు… ఇప్పటివరకూ తన క్లయింట్‌ను విచారించేందుకు ఎలాంటి నోటీసులూ జారీ చేయలేదని వాదించారు. అందువల్ల మధ్యంతర రక్షణ కల్పించాలని కోరారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది దాన్ని ఖండించారు. శ్రవణ్ పరారీలో ఉన్నారని, ఆయనను పట్టుకునేందుకు రెడ్‌కార్నర్ నోటీసు సైతం జారీ అయిందనీ వివరించారు. శ్రవణ్‌ను అరెస్టు చేస్తారా అని ఆయన తరఫు న్యాయవాదిని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. శ్రవణ్ అమెరికాలో ఉన్నందునే అరెస్టు చేయలేదని లాయర్ వివరించారు. మధ్యంతర రక్షణ కల్పిస్తే రెండురోజుల్లో భారత్ వస్తారని చెప్పారు.
నిందితుడు దేశానికి రావడం ముఖ్యం కాబట్టి, ఆయనపై అరెస్టు వంటి కఠిన చర్యలు తీసుకోకూడదని ఆదేశించి, సుప్రీంకోర్టు శ్రవణ్‌కు ఊరట కల్పించింది. అదే సమయంలో పోలీసు దర్యాప్తుకు సహకరించాలంటూ షరతు విధించింది. దానికి శ్రవణ్ తరఫు న్యాయవాది అంగీకరించారు. అవసరమైతే 48గంటల వ్యవధిలో శ్రవణ్ భారతదేశానికి వస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనానికి తన క్లయింట్ తరఫున హామీ ఇచ్యచారు.
ఆ నేపథ్యంలో… సిట్ ఆయనకు 72గంటల గడువునిచ్చింది. శనివారం విచారణకు హాజరు కావాలంటూ సమయం నిర్ధారించింది. ఆ మేరకు శ్రవణ్ రావు ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ సిట్ విచారణకు హాజరయ్యారు.