తెలంగాణలో డిగ్రీ కోర్సుల సిలబస్‌లో మార్పుచేర్పులకు ఉన్నత విద్యామండలి కసరత్తు ఓ కొలిక్కి వచ్చిందని మండలి అధికారులు చెప్పారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రణాళికను రూపొందిస్తున్నారు.
సాధారణ డిగ్రీ కోర్సులు చదివే విద్యార్ధులకు సైతం మెరుగైన ఉపాధి అవకాశాలు ఉండాలనే ఉద్దేశంతో పాఠ్యాంశాల్లో సాంకేతిక విషయాలకు చోటు కల్పించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి భావిస్తోంది. జాబ్ మార్కెట్లో ఉద్యోగం రావాలన్నా, వివిధ పోటీ పరీక్షలకు అదనపు కోచింగ్ అవసరం లేకుండా హాజరుకాగలగాలన్నా, లేదా స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలన్నా దానికి వీలుగా విద్యాభ్యాసం ఉండాలి. అందుకే బీఎస్సీ, బీకాం, బీఏ కోర్సుల్లో ప్రతీ సెమిస్టర్‌లోనూ ఒక టెక్నాలజీ సబ్జెక్టును తప్పనిసరి పేపర్‌గా ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. మొత్తం ఆరు సెమిస్టర్లలో ఆరు టెక్నాలజీ పేపర్లతో పాటు రెండు ఇంటర్న్‌షిప్‌లు కూడా ప్రవేశపెడతారు. మూడేళ్ళ డిగ్రీ కోర్సుకు 120 క్రెడిట్లు, నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సుకు 160 క్రెడిట్లు ఇస్తారు.
బీఏ ఎకనామిక్స్ మొదటి సెమిస్టర్లో బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, రెండో సెమిస్టర్లో డేటా అనాలసిస్, మూడో సెమ్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ డెవలప్మెంట్, నాలుగో సెమ్‌లో డిజిటల్ లిటరెసీ, ఐదో సెమిస్టర్లో ఫండమెంటల్స్ ఆఫ్ ఏఐ టూల్స్ అండ్ టెక్నాలజీ, ఆఖరి సెమిస్టర్లో ఇంట్రో టు సైబర్ క్రైమ్ అనే పేపర్లు ఉంటాయి. అలాగే బీకాం, బీఎస్సీ కోర్సుల్లో కూడా టెక్నాలజీ పేపర్లు ఉంటాయి. చివరి రెండు సెమిస్టర్లలో ఇంటర్న్‌షిప్ తప్పనిసరిగా చేయాల్సిందే. బీఎస్సీ కోర్సుల్లో మెంల్ ఎబిలిటీ, రీజనింగ్, అరిథ్‌మెటిక్ వంటి సబ్జెక్టులను కూడా చేరుస్తున్నారు.
ఇంగ్లిష్ సబ్జెక్టులో కూడా గణనీయమైన మార్పులు చేయాలని భావిస్తున్నారు. కమ్యూనికేటివ్ ఇంగ్లిష్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంగ్లిష్ సబ్జెక్టును మొదటి సెమిస్టర్లో ఇంగ్లిష్ కమ్యూనికేషన్, రెండో సెమిస్టర్లో క్రిటికల్ థింకింగ్ అండ్ రీజనింగ్, మూడో సెమిస్టర్లో బిజినెస్ కమ్యూనికేషన్ అనే సబ్జెక్టులుగా ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రణాళికలు వేస్తోంది.
వచ్చే విద్యాసంవత్సరాన్ని త్వరగా ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. దానికి వీలుగా… కొత్త సిలబస్‌లను త్వరలో ఖరారుచేయడానికి కసరత్తు చేస్తోంది. ఆ కరిక్యులమ్‌ను విశ్వవిద్యాలయాల ఆమోదం కోసం పంపిస్తారు. ఆ తర్వాత కొత్త పుస్తకాలను ముద్రించి పంపిణీ చేస్తారు.