లోక్‌సభలో రాహుల్ గాంధీకి మాట్లాడడానికి కేటాయించిన సమయానికి ఆయన వియత్నాం వెళ్ళిపోయారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. అక్కడినుంచి తిరిగివచ్చాక మాట్లాడతానంటూ పట్టు పట్టారని వెల్లడించారు. సభలో మాట్లాడడానికి నియమ నిబంధనలు ఉంటాయనీ, ఆ విషయం రాహుల్ గాంధీకి తెలియదేమో అనీ అమిత్ షా వ్యాఖ్యానించారు.
శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక టీవీఛానెల్ సదస్సులో పాల్గొన్నారు. పార్లమెంటులో తనకు సమయం ఇవ్వడం లేదంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై స్పందించారు. బడ్జెట్ మీద చర్చల్లో మొత్తం సమయంలో 42శాతం రాహుల్‌కే కేటాయించారని వెల్లడించారు. పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కాదనీ, అక్కడ నిబంధనలను పాటించాలనీ చురకలు వేసారు.
దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయన్న ప్రతిపక్షాల ఆరోపణల గురించి అడిగినప్పుడు… అదే నిజమైతే కాంగ్రెస్ నేతలు జైళ్ళలో ఉండేవారని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం కాంట్రాక్టుల్లో 4శాతం ముస్లిములకు రిజర్వేషన్ కేటాయించడాన్ని అమిత్ షా తప్పుపట్టారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం మతం ఆధారంగా కాంట్రాక్టులు ఇవ్వడం సరికాదన్నారు.