ఆపరేషన్ ‘ బ్రహ్మ’లో భాగంగా టెంట్లు, దుప్పట్లు, మందులు, ఆహారం అందజేత
భూకంపంతో తీవ్రంగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించిన మయన్మార్ కు భారత్ సాయం అందజేసింది. దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని సైనిక రవాణా విమానంలో పంపింది. ‘ఆపరేషన్ బ్రహ్మ’ పేరిట ఈ సాయాన్ని అందజేసింది. భారత వైమానిక దళానికి చెందిన C130J విమానం హిండన్ వైమానిక దళ కేంద్రం నుంచి మయన్మార్‌కు బయల్దేరింది. టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, జనరేటర్లు, ఆహార ప్యాకెట్లు, నీటి శుద్ధి పరికరాలు, సౌర దీపాలు, కొన్ని రకాల మందులు తీసుకుని విమానం బయలుదేరింది. అమెరికా, ఇండోనేషియా, చైనా కూడా అవసరమైన సాయాన్ని అందజేసేందుకు ముందుకు వచ్చాయి.
మయన్మార్, థాయలాండ్ ను శుక్రవారం నాడు రెండు అత్యంత శక్తిమంతమైన భూకంపాలు కుదిపేశాయి. నిమిషాల వ్యవధిలోనే చోటు చేసుకున్న భూ ప్రకంపనలతో రెండు దేశాల ప్రజలు భయంతో వణికిపోయాయి. రోడ్లు, వంతెనలు, ఎయిర్‌పోర్ట్‌లు ధ్వంసమయ్యాయి. పెద్దపెద్ద భవనాలు నేలమట్టం అయ్యాయి. పెద్ద మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా నష్టపోయిన మయన్మార్, థాయ్‌లాండ్‌ను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొచ్చాయి.
మయన్మార్‌లో కనీసం 1002 మంది మరణించినట్లు ఆ దేశ మిలిటరీ తెలిపింది. మరో, 2370 మంది గాయపడినట్లు ప్రకటనలో పేర్కొంది. శిథిలాల కింద వందల మంది చిక్కుకున్నట్లు తెలిపారు. బ్యాంకాక్ లో 10 మంది మరణించగా ఓ భారీ భవంతి కూలిన ఘటనలో దాదాపు 100 మంది నిర్మాణ కార్మికులు గల్లంతయ్యారు.