ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లి గ్రామంలో నివసిస్తున్న ఒక వృద్ధురాలిని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ శుక్రవారం ఒక కాల్ వచ్చింది. సైబర్ నేరగాళ్ళు ఆ మహిళను సుమారు రెండు గంటల పాటు వేధింపులకు గురి చేసారు. బాధితురాలి తల్లి విజయవాడలోని మనవరాలికి ఫోన్ చేయడంతో ఆ నేరగాళ్ళ కాల్ కట్ అయింది. చివరికి సైబర్ క్రైమ్ పోలీసులు బాధితురాలితో మాట్లాడి ధైర్యం చెప్పారు.
దాసరి హైమావతి అనే 65 ఏళ్ళ మహిళ తన తల్లితో కలిసి ఇందుపల్లి గ్రామంలో నివసిస్తున్నారు. శుక్రవారం ఆమెకు ఒక వ్యక్తి ఫోన్ చేసి హిందీలో మాట్లాడాడు. తనకు హిందీ రాదని చెప్పడంతో మరోవ్యక్తి లైన్లోకి వచ్చి తెలుగులో బెదిరించడం మొదలుపెట్టాడు. హైమావతి ఆధార్ కార్డుకు అనుసంధానమై ఉన్న మొబైల్ నెంబర్‌ను అసాంఘిక, నేరపూరిత కార్యక్రమాలకు వినియోగిస్తున్నారంటూ బెదిరించాడు. ఆ మేరకు బెంగళూరులో పోలీసు కేసు నమోదయిందని భయపెట్టాడు. మీ ఫోన్ నెంబర్లన్నీ బ్లాక్ చేస్తామని, బెంగళూరు వచ్చి మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అయిందంటూ ఫిర్యాదు చేయాలనీ చెప్పుకొచ్చాడు. ఆ విషయం ఎవరికీ చెప్పవద్దని, గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకుని వీడియో కాల్ చేయాలని హెచ్చరించాడు.
బాధితురాలు తాను బైటకు వెళ్ళాల్సి ఉందని చెప్పినా నేరస్తుడు వినలేదు. దాంతో హైమావతి తల్లి కంగారు పడి,
ఆ విషయాన్ని విజయవాడలో ఉండే హైమావతి కుమార్తెకు తెలియజేసారు. ఆమె, అల్లుడు వెంటనే స్పందించి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేసారు. అంతో హైమావతి, నేరగాళ్ళు చెప్పినట్లు ఒక గదిలోకి వెళ్ళి వీడియో కాల్ చేసారు. నేరగాళ్ళు వీడియో కాల్లో హైమావతిని తీవ్రంగా భయపెట్టారు. అంతలో బాధితురాలి కుమార్తె, అల్లుడు ఫోన్ చేయడంతో వీడియో కాల్ కట్ అయింది. మరికాసేపటికే సైబర్ క్రైమ్ పోలీసులు హైమావతితో మాట్లాడి, భయపడవలసిన పని లేదంటూ ధైర్యం చెప్పారు. ఆ తర్వాత వేరే వేరే నెంబర్ల నుంచి కాల్స్ వచ్చినా హైమావతి ఇంక ఫోన్ తీయలేదు.
కొద్దికాలం క్రితమే మొదలైన డిజిటల్ అరెస్టు మోసాలు మొదట్లో పెద్దపెద్ద నగరాలు, పట్టణాల్లోనే జరుగుతాయి అనుకునేవారు. అయితే పట్టణ, నగర పౌరుల్లో అటువంటి మోసాల గురించి చైతన్యం పెరిగింది. దాంతో మోసగాళ్ళు దారి మార్చుకున్నారు. ఇప్పుడు చిన్నచిన్న ఊళ్ళను సైతం టార్గెట్ చేసుకుంటున్నారు. వయసులో పెద్దవారయితే త్వరగా భయపడే అవకాశాలు ఎక్కువ కాబట్టి వాళ్ళను లక్ష్యం చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి కాల్స్‌కు భయపడాల్సిన అవసరం లేదు. అరెస్టు చేసామని చెబుతున్న వారితో కొద్దిసేపు మాట్లాడితే వారి అసలు రంగు తెలిసిపోతుంది. పోలీసులు ఎవరూ వేరే ఊరినుంచి ఫోన్లు చేయరు, అందునా వీడియో కాల్స్ చేసి పోలీస్ స్టేషన్ వాతావరణాన్ని చూపించరు. మీ ఇంట్లోనే ఒంటరిగా ఒక గదిలో స్వీయ నిర్బంధంలో ఉండాలని హెచ్చరించరు. అలా ఎవరైనా ఫోన్లు చేస్తే, వారి గురించి వెంటనే పోలీసులకు తెలియజేయడం మంచిది. పోలీసులు మీ భద్రతకు సహాయపడతారు, సైబర్ నేరగాళ్ళ పని పడతారు.