ప్రపంచంలోనే అరుదైన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విరివిగా లభిస్తోంది. దేశవిదేశాల్లో ఖ్యాతిగాంచిన ఈ గ్రానైట్‌కు జియోగ్రాఫికల్ ఇండికేషన్(GI) గుర్తింపు కోసం ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
చీమకుర్తి మండల పరిధిలోని చీమకుర్తి, ఆర్‌ఎల్‌పురం, బూదవాడ, దేవరపాలెంలో గ్రానైట్ గనులు విస్తరించి ఉన్నాయి. పాలిష్ చేసిన రాళ్ళను నివాసాలు, బహుళ అంతస్తులు, వ్యాపార సముదాయాల్లో ఫ్లోరింగ్, ఎలివేషన్, మెట్లు, కిచెన్, అలంకరణ వస్తువుల తయారీ కోసం ఉపయోగిస్తారు. బీజింగ్‌లో నిర్వహించిన ఒలింపిక్స్ క్రీడల స్టేడియాలకు వన్నెలద్దడానికి కూడ ఉపయోగించారు. నల్లని వర్ణంలో ఉండే ఈ రాళ్ళలో ఫెల్‌స్పార్, మైకా, క్వార్జ్‌తో పాటు బంగారు వర్ణంలో మెరిసే బ్రాంజైట్ ముక్కలు ఒదిగి ఉంటాయి. ఇవన్నీ నక్షత్రాలతో కూడిన పాలపుంతను తలంపించేలా కనిపిస్తాయి.
దృఢత్వం, మన్నిక, వాతావరణ పరిస్థితులను తట్టుకునే స్వభావం ఉండటంతో పాటు బంగారు రంగులో మెరుస్తుండటంతో అందరూ ఈ రాళ్ళకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అమెరికా, చైనా, యూరప్, అరబ్ తదితర 30 దేశాల వాసులు దిగుమతి చేసుకుంటుంటారు. అయితే కొందరు గ్రానైట్ పలకలనూ గెలాక్సీగా నమ్మిస్తూ విక్రయించి మోసాలకు పాల్పడుతున్నారు.
చీమకుర్తి మండలంలో మాత్రమే లభించే ఈ గెలాక్సీ గ్రానైట్ ప్రత్యేకతలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు నకిలీల బెడద అరికట్టేందుకు భౌగోళిక సూచిక గుర్తింపు(జీఐ) అవసరమని అధికారులు భావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ విషయాన్ని కలెక్టర్ తమీమ్ అన్సారియా వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జీఐ ట్యాగ్ సాధనకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు జిల్లా భూగర్భ గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ వివరించారు .
చీమకుర్తి, ఆర్‌ఎల్‌పురం, బూదవాడ ప్రాంతాల పరిధిలో సుమారు రెండు వేల ఎకరాల పరిధిలో గ్రానైట్ విస్తరించి ఉంది. 1990 నుంచి ఇక్కడ గ్రానైట్ అమ్మకాలు జరుగుతున్నాయి. దాదాపు లక్ష మంది ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వానికి పన్నుల రూపంలో సుమారు రూ. 200 కోట్ల ఆదాయం లభిస్తుంది.