రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి శాసనసభ (2014) ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంగా అమరావతిని ఏర్పాటు చేసారు. అయితే అమరావతి రాజధాని ప్రాంతంలో ఆయనకు నివాసం లేదు. ఉండవల్లిలో లింగమనేని రమేష్‌కు చెందిన ఒక భవనంలో ఆయన ఉంటున్నారు. దానిమీద వైఎస్ఆర్‌సిపి చాలా విమర్శలు గుప్పించిన చరిత్ర తెలిసిందే.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిలో స్థిర నివాసం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. గతేడాది చివర్లో ఆయన అమరావతి రాజధాని ప్రాంతంలో వెలగపూడి గ్రామంలో ఐదెకరాల స్థలాన్ని కొనుగోలు చేసారు. ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకోనున్నారు. ఏప్రిల్ 9న శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. ఆ ప్రాంతం అమరావతి ప్రభుత్వ సముదాయాలకు 2 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం విశేషం.
అమరావతి రాజధాని నిర్మాణ పనులను మళ్ళీ మొదలుపెట్టనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఏప్రిల్ నెలలో ఆ కార్యక్రమాలు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి కూడా తన ఇంటిని నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెడుతుండడం విశేషం.
సొంతింటి నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. నివాస ప్రాంతం, ఇంటిముందు తోట, రక్షణ సిబ్బందికి అవసరమైన గదులు, వాహనాల పార్కింగ్, చంద్రబాబును కలవడానికి వచ్చేవారికోసం ఏర్పాట్లు, తదితర అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణం జరుగుతుందని సమాచారం. కొద్దిరోజుల్లో జరగబోయే శంకుస్థాపనకు సన్నాహాలు మొదలయ్యాయి. చంద్రబాబు కుమారుడు లోకేష్ కార్యాలయ సిబ్బంది, వాస్తు నిపుణులు శుక్రవారం నాడు స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలానికి త్వరలో రిజిస్ట్రేషన్ చేయిస్తారని తెలుస్తోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే అమరావతి రాజధాని పరిధిలోని తాడేపల్లి గ్రామంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు గృహప్రవేశం చేసారు. అప్పట్లో చంద్రబాబుకు అమరావతిలో నివాసం లేదంటూ వైసీపీ నాయకులు రచ్చ చేసేవారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో చంద్రబాబును వైసీపీ నాయకులు పొరుగు రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష నాయకుడు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించేవారు. చంద్రబాబుకు అమరావతి కంటె హైదరాబాద్ పైనే మక్కువ ఎక్కువ అంటూ విమర్శించేవారు. ఆ నేపథ్యంలో, ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత చంద్రబాబు అమరావతిలో స్థిర నివాసానికి ఏర్పాట్లు చేసుకుంటూండడం ప్రాధాన్యం సంతరించుకుంది.