ఓబుళాపురం ఇనుప గనుల్లో అక్రమ మైనింగ్ కేసు కొలిక్కి వచ్చింది. మేలోగా కేసు తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ టి. రఘురాం తీర్పును మే 6న ఇవ్వనున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. 13 ఏళ్లపాటు కేసు విచారణ సాగింది. 3400 డాక్యుమెంట్లు పరిశీలించారు.
219 మంది సాక్షులను విచారించారు.
ఓబుళాపురం మైనింగ్ యజమానులు బివి.శ్రీనివాసరెడ్డి, గాలి జనార్థన్‌రెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, గాలి జనార్థన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ అలీఖాన్, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వి.డి. రాజగోపాల్, మాజీ ఐఏఎస్ అధికారి కృపానందం, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిలపై 420, 120బి రెడ్ విత్, 409, 468, 471 సెక్షన్ల కింద కేసులు నమోదు చేుశారు. మరికొందరిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి విచారించారు.
ఓబుళాపురం గనుల ఆక్రమణ, అక్రమమైనింగ్‌పై 2009లో కేసు నమోదైంది. కేసును సిబిఐకి అప్పగించారు. 2011లో మొదటి అభియోగపత్రం దాఖలైంది. తరవాత ఈ కేసులో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి, మెఫజ్ అలీఖాన్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నిందితులుగా చేర్చారు. డిశ్ఛార్జి పిటిషన్లు, క్వాష్ పిటిషన్లతో విచారణ 13 ఏళ్లు కొనసాగింది. చివరకు మే నెలకల్లా కేసులో తీర్పు వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో మే6న తీర్పు చెప్పనున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ రఘురాం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కేసులో 9 మంది నిందితులు
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి గాలి జనార్థన్‌రెడ్డి, బివి. శ్రీనివాసరెడ్డి, మాజీ ఐఏఎస్ రాజగోపాల్, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, అనంతపురం జిల్లా గనుల శాఖ మాజీ సహాయ డైరెక్టర్ ఆర్. లింగారెడ్డి, ఐఏఎస్ శ్రీలక్ష్మి, అలీఖాన్, కృపానందం, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిందితులుగా ఉన్నారు విచారణ దశలో లింగారెడ్డి మృతి చెందాడు. శ్రీలక్ష్మి పేరును 2022లో డిశ్చార్జి చేశారు.
కేసు పూర్వాపరాలు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో గాలి జనార్థన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి అనంతపురం జిల్లా రాయదుర్గంలో గనులు కేటాయించారు. డి.హీరేహాల్ మండలంలో 68.5 హెక్టార్లు, ఓబుళాపురంలో 39.5 హెక్టార్లు కేటాయించారు. గనుల కేటాయింపులో అప్పటి జిల్లా భూగర్భ గనుల శాఖ సహాయ డైరెక్టర్ లింగారెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. 93 హెక్టార్లకు నోటిఫికేషన్ జారీ చేయగా గాలి జనార్థన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ, గాలి మామ పరమేశ్వరరెడ్డి కంపెనీ వినాయక మైనింగ్ సహా, మొత్తం 23 దరఖాస్తులు వచ్చాయి.
మొదట వచ్చిన దరఖాస్తునే పరిగణనలోకి తీసుకుని మిగిలిన దరఖాస్తులు పట్టించుకోలేదు. దీంతో ఓఎంసీకి 68.5, ఏపీఎండీసీకి 25 హెక్టార్లు లీజు కేటాయించారు.
దరఖాస్తులను ఎందుకు తిరస్కరించారో సరైన కారణం చెప్పలేదు. దీంతో ఆయా కంపెనీలు కోర్టులను ఆశ్రయించాయి. గనులలీజుల మంజూరులో అప్పటి గనుల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి అత్యుత్సాహం ప్రదర్శించారు. 2 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు అయ్యే బ్రహ్మణి స్టీల్ భవిష్యత్తులో 10 మిలియన్ టన్నుల సామర్థ్యానికి చేరుకుంటుందంటూ ఓఎంసీ దరఖాస్తు పరిగణనలోకి తీసుకున్నారు. అదే రోజు అప్పటి గనుల మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంతకాలు చేసి జీవో ఇచ్చారు.
క్యాప్టివ్ మైనింగ్ పేరుతో లీజులు తీసుకుని ఇనుప ఖనిజాన్ని విదేశాలకు తరలించి వేల కోట్లు కొల్లగొట్టారనేది ప్రధాన ఆరోపణ. అధికారులు, రాజకీయ నాయకులు గాలి కంపెనీకి అండగా నిలిచారు. లీజులు పొందిన ప్రాంతంతో పాటు సరిహద్దులుదాటి కర్ణాటకలోనూ తవ్వకాలు జరిపారు. దాదాపు రూ.884 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని సీబీఐ పేర్కొంది.