పదవ తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష తేదీని మార్చి 31 లేదా ఏప్రిల్ 1న నిర్వహిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ముస్లిముల పండుగ రంజాన్ సెలవు ఏ రోజు వస్తుందో తెలియని కారణంగా పరీక్ష తేదీని ఖరారు చేయలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31న రంజాన్ సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో పరీక్షను ఏప్రిల్ 1నే నిర్వహిస్తామని పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసుల రెడ్డి స్పష్టం చేసారు. ఆ విషయాన్ని సంబంధిత విభాగాలు అన్నింటికీ తెలియజేయాలని అధికారులకు ఆయన సూచించారు.
రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పరీక్షల మూల్యాంకన తేదీలను కూడా ఖరారు చేసారు. పదో తరగతి పరీక్షాపత్రాలను దిద్దడానికి ఏప్రిల్ 3 నుంచి 9 వరకూ మూల్యాంకనం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఆ సెంటర్స్‌లో పేపర్లు దిద్దే ఉపాధ్యాయులు సెల్‌ఫోన్లు వాడకుండా నిషేధం విధించారు. ఒక్కొక్క అసిస్టెంట్ ఎగ్జామినర్ ఒక్కొక్క రోజుకు 40 పరీక్షా పత్రాలను దిద్దవలసి ఉంటుంది. వాటిని పై అధికారులు పరిశీలిస్తారు. రీకౌంటింగ్‌లో మార్కుల్లో తేడా వస్తే సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు, అంతే కాదు వారికి జరిమానా కూడా విధిస్తారు.
సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాలను ఏప్రిల్ 3 నుంచి 7 వరకూ మూల్యాంకనం చేస్తారు. వారికి కూడా పైన పేర్కొన్న నిబంధనలన్నీ వర్తిస్తాయని పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసుల రెడ్డి స్పష్టం చేసారు.