ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఐఐటీ మద్రాస్ సహకారంతో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని, ఏపీని ఏఐ, డీప్ టెక్నాలజీకి కేంద్రస్థానంగా మారుస్తామనీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. భారతదేశంలో 65 శాతం మంది ఏఐ వినియోగిస్తున్నారని, అది ప్రపంచ సగటు 30 శాతం కన్నా అధికమనీ అన్నారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త సాంకేతికతలలో విద్యార్థులు ముందుండాలని పిలుపునిచ్చారు. చెన్నైలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్‌లో జరిగిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025కు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఐఐటీ మద్రాస్‌లో జరిగిన సదస్సులో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం ప్రపంచం చూపు భారతదేశం వైపు ఉంది. రాబోయే రోజులంతా భారతదేశానివే. ఐఐటీ మద్రాస్ చాలా విషయాల్లో మొదటి స్థానంలో ఉంది. వివిధ రకాల ఆన్లైన్ కోర్సులు కూడా అందిస్తోంది. ఐఐటీ మద్రాస్ విద్యార్ధుల స్టార్టప్ కంపెనీలు అగ్నికుల్ కాస్మోస్, మైండ్‌గ్రో టెక్నాలజీస్ వంటి సంస్థల్లో నూతన పరిశోధనలు భారతదేశాన్ని అంతరిక్షం, సెమీ కండక్టర్ రంగాల్లో ముందుండేలా చేస్తున్నాయి. ఇక్కడి స్టార్టప్‌లు దాదాపు 80 శాతం విజయవంతం అయ్యాయి. మద్రాస్ ఐఐటీలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 40 శాతం వరకూ ఉన్నారు’ అని చెప్పారు.
‘‘భారతదేశం 2014లో ప్రపంచంలో పదో ఆర్ధిక వ్యవస్ధగా ఉండేది. ఇప్పుడు ఐదవ స్థానానికి ఎదిగింది. మనమంతా మరింత కృషి చేస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుంది. మన దేశానికి ఇంకో 40 ఏళ్ల దాకా జనాభా సమస్య ఉండదు. దక్షణ భారతదేశంలో కూడా జనాభాను పెంచాలి. అమెరికాలో అత్యధిక తలసరి ఆదాయం భారతీయులదే. భారతీయులు సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుంటారు. సిలికాన్ వ్యాలీ, నాసా, వాల్ స్ట్రీట్‌లలో ఆధిపత్యాన్ని సాధిస్తున్నారు’’ అంటూ భారతదేశపు ఘనతను కొనియాడారు.
గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీ నిర్దేశించుకున్న లక్ష్యాలను సీఎం వివరించారు. ‘‘ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుంది. భవిష్యత్తులో ఏపీ రూ.2 రూపాయలకే యూనిట్ విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది. భారతదేశం మొత్తం 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం ఉంటే, ఇందులో 160 గిగావాట్లు ఒక్క ఏపీలోనే ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాం. ఎనర్జీలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి 7.5 లక్షల ఉద్యోగాల సాధనే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ యూనిట్ స్థాపిస్తోంది. రిలయన్స్ బయోఎనర్జీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతోంది. రాబోయే రెండేళ్లలో 20 లక్షల ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేస్తున్నాం’’ అని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఐటీ విధానం దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఏఐ వినియోగాన్ని మరింత ప్రోత్సహిస్తామన్నారు. ఏపీలో ప్రూఫ్-ఆఫ్-కాన్సెప్ట్ అవకాశాలను కల్పిస్తామన్నారు. ఆ కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి తదితరులు పాల్గొన్నారు.