భారీ భూకంపం థాయ్‌లాండ్, మయన్మార్ దేశాలను కుదిపేసింది. 12 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్టేలుపై 7.7గా నమోదైంది. థాయ్ రాజధాని బ్యాంకాక్ నగరం భూకంపందాటికి ఊగిపోయింది. రెండుసార్లు తీవ్రమైన ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పలు భవనాలు నేలకూలాయి. మరికొన్ని ఒరిగిపోయాయి. ప్రాణ భయంతో జనం పరుగులు తీశారు.
బ్యాంకాక్‌లో భూకంప తీవ్రత 6.4, 7.3గా నమోదైంది. భారత్ సహా పలు ఆగ్నేయ ఆసియా దేశాల్లో భూకంపం ప్రభావం కనిపించింది. సెంట్రల్ మయన్మార్ మోనివా నగరానికి తూర్పున 50 కి.మీ దూంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే గుర్తించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాలకు భూకంపం సంభవించింది. భారీ భవనాల్లో హెచ్చరిక అలారమ్ మోగడంతో జనం పరుగులు తీశారు.
భూకంపం తీవ్రతకు భవనాలు ఊగిపోయాయి. నిర్మాణం ఉన్న భారీ భవనం ఒకటి నేలమట్టం అయింది. అందులో 43 మంది కార్మికులు చిక్కుకుపోయారని అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది.థాయ్ ప్రధాని షినవత్ర అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మయన్మార్‌లోనూ పలు భవనాలు నేలమట్టం అయ్యాయని తెలుస్తోంది.