దాయాది దేశం పాకిస్తాన్‌లో మైనారిటీలతో వ్యవహరిస్తున్న తీరును భారతదేశం నిశితంగా పరిశీలిస్తోందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ఆ విషయాన్ని అంతర్జాతీయ స్థాయిలో చర్చకు పెడతామన్నారు. ఇవాళ లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ‘పాకిస్తాన్‌లో మైనారిటీలపై జరుగుతున్న దుర్మార్గాలు, నేరాలు’ అనే అంశం మీద ప్రశ్నకు జయశంకర్ సమాధానమిచ్చారు.
పాకిస్తాన్‌లో ఈ యేడాది ఫిబ్రవరి నెలలో మైనారిటీలపై దుర్మార్గాలకు సంబంధించిన కనీసం పది కేసులు వెలుగు చూసాయని చెప్పారు. వాటిలో ఏడు కేసులు బలవంతంగా ఎత్తుకుపోయి మతం మార్చడానికి సంబంధించినవి, రెండు అమ్మాయిలను ఎత్తుకుపోయిన కేసులు, ఒకటి హోలీ వేడుకలు చేసుకుంటున్న పిల్లల మీద పోలీసులు చర్యలు తీసుకున్నది.
తనకు ఎదురైన ప్రశ్నకు జయశంకర్ ఇలా జవాబిచ్చారు. ‘‘ఈ ప్రశ్నలో రెండు భాగాలున్నాయి. మొదటిది… పాకిస్తాన్‌లో మైనారిటీలు ఎదుర్కొంటున్న దౌష్ట్యాలు, నేరాలను మనం పరిశీలిస్తున్నామా? రెండవది… దాని గురించి అంతర్జాతీయ స్థాయిలో మనం ఏం చేస్తున్నాం? మొదటి ప్రశ్నకు జవాబు… అవును. మనం చాలా నిశితంగా పరిశీలిస్తున్నాం. పాకిస్తాన్‌లో మైనారిటీలతొ ఎలా వ్యవహరిస్తున్నారన్న అంశాన్ని మనం చాలా నిశితంగా పరిశీలిస్తున్నాం. ఆ విషయాన్ని సభకు ఒక ఉదాహరణతో చెబుతాను. మొన్న ఫిబ్రవరి నెలలో పాకిస్తాన్‌లో హిందువుల మీద దుశ్చర్యలకు పాల్పడిన సందర్భాలు పది ఉన్నాయి. వాటిలో ఏడు అమ్మాయిలను ఎత్తుకుపోయి మతం మార్చిన సంఘటనలు. రెండు ఎత్తుకుపోయిన సంఠఘటనలు. మరొకటి హోలీ వేడుకలు జరుపుకుంటున్న విద్యార్ధుల మీద పోలీసుల దురాగతం.
జయశంకర్ అక్కడితో ఆగిపోలేదు. ఇతర మైనారిటీ మతాల గురించి కూడా వివరించారు. ‘‘పాకిస్తాన్‌లో సిక్కుల మీద దుశ్చర్యలకు సంబంధించి మూడు సంఘటనలు జరిగాయి. మొదటి కేసులో ఒక సిక్కు కుటుంబం మీద దాడి జరిగింది. రెండో కేసులో పాత గురుద్వారాను మళ్ళీ తెరిచినందుకు ఒక సిక్కు కుటుంబాన్ని బెదిరించారు. మూడవ కేసులో ఒక సిక్కు అమ్మాయిని ఎత్తుకుపోయి మతం మార్చారు. అలాగే అహ్మదీయ ముస్లిముల మీద దుర్మార్గాలకు సంబంధించి రెండు కేసులున్నాయి. మొదటి కేసులో అహ్మదీయ తెగ వారి మసీదును బలవంతంగా మూసివేసారు. రెండో కేసులో అహ్మదీయ తెగకు చెందిన వారి 40 సమాధులను ధ్వంసం చేసారు. అలాగే క్రైస్తవుల మీదా ఒక దుర్మార్గమైన చర్య జరిగింది. మానసిక స్థిరత్వం లేని ఒక క్రైస్తవ వ్యక్తి మీద దైవదూషణ చేసాడని కేసు నమోదయింది’’ అని జయశంకర్ వివరించారు.
పాకిస్తాన్‌లో మైనారిటీల మీద జరుగుతున్న దుర్మార్గాల గురించి అంతర్జాతీయ వేదికల మీద ప్రస్తావిస్తున్నామని జయశంకర్ వివరించారు. దానికి ఉదాహరణగా అలా ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో చేసిన రెండు ప్రస్తావనల గురించి వివరించారు. ‘‘ఫిబ్రవరి నెలలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కౌన్సిల్‌లో మా ప్రతినిధి పాకిస్తాన్ దుశ్చర్యల గురించి ప్రస్తావించారు. మైనారిటీల మానవ హక్కుల ఉల్లంఘన, దూషణలు, మతప్రాతిపదికన హింస, ప్రజాస్వామిక విలువల క్షీణత అనేవి పాకిస్తాన్ దేశపు విధానాలు. ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ నిస్సిగ్గుగా ఆశ్రయం ఇస్తుంది. అలాంటి పాకిస్తాన్‌కు ఇతర దేశాలకు పాఠాలు చెప్పే స్థాయి లేదు. దానికి బదులు పాకిస్తాన్ తమ సొంత దేశపు ప్రజలకు నిజమైన పరిపాలనను, న్యాయాన్నీ అందించడం మీద దృష్టి సారించాలి. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మా ప్రతినిధి రెండు వారాల క్రితమే పాకిస్తాన్ మతోన్మాద భావజాలాన్ని బైటపెట్టారు. అలా, మేము ఈ విషయాలను అంతర్జాతీయ వేదికల మీద ప్రస్తావిస్తున్నాం’’ అని జయశంకర్ చెప్పారు.
మార్చి 26 బుధవారం నాడు హ్యూమన్ రైట్స్ ఫోకస్ పాకిస్తాన్ (హెచ్ఆర్ఎఫ్‌పి) అనే సంస్థ 2025 మొదటి త్రైమాసిక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం, పాకిస్తాన్‌లో మతపరంగా మైనారిటీలు ఎదుర్కొంటున్న సవాళ్ళు, హింసాకాండ చాలా వేగంగా పెరిగిపోతున్నాయి.
పాక్ మైనారిటీలపై రోజురోజుకూ పెరిగిపోతున్న హింసాత్మక దాడులను ఆ సంస్థ ఖండించింది. వనరుల లేమి కారణంగా బాధితులకు ఊరట, న్యాయం కలిగించడం సాధ్యం కావడం లేదని వెల్లడించింది. పాక్ సమాజంలో పెద్ద స్థాయిలో ఉన్న మతగురువులు, రాజకీయ నాయకుల అండదండలతోనే మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఆ నివేదిక వివరించింది.
‘‘పాకిస్తాన్‌లో దాడులు, హత్యలు, దైవదూషణ ఆరోపణలు, కిడ్నాపులు, బలవంతపు మతమార్పిడులు, బలవంతపు పెళ్ళిళ్ళు చేయడానికి సులువైన లక్ష్యం మతపరమైన మైనారిటీలే. వారి కష్టాల గురించి కనీసం పట్టించుకునే నాథుడు లేడు. ఆ నిర్లక్ష్యం మరింత దుస్సహం’’ అని హెచ్ఆర్ఎఫ్‌పి అధ్యక్షుడు నవీద్ వాల్టర్ చెప్పుకొచ్చారు.