తిరుమల శ్రీవారి దర్శనం త్వరలో సులభం కానుంది. భక్తుల రద్దీపై ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించనున్నారు. ఏఐ సాంకేతికత అందించేందుకు గూగుల్ ముందుకు వచ్చింది. మరో వారంలో టీటీడీతో గూగుల్ ఒప్పందం చేసుకోనుంది. ఒప్పందం తరవాత గూగుల్ ఏఐ ఆధారిత సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. క్యూలైన్లలో భక్తుల రద్దీ, వసతి కోసం ఏర్పాట్లు, వెంగమాంబ అన్నదానం వద్ద భక్తుల రద్దీ, లడ్డూల పంపిణీ వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఏఐ ఉపయోగపడనుంది.
నూతన సాంకేతికత ద్వారా టీటీడీ భక్తులకు త్వరగా దర్శనం కల్పించడంతోపాటు, వసతి ఏర్పాటులో ఇబ్బందులను తొలగించనుంది. గూగుల్ ఒప్పందం తరవాత ప్రతి భక్తుడి దర్శన హిస్టరీ నమోదు చేయనున్నారు. ఎవరెవరు స్వామి వారిని ఎన్నిసార్లు దర్శించుకుంటున్నారు. గదులు ఎన్ని తీసుకున్నారు అనే వివరాలు టీటీడీ వద్ద అందుబాటులోకి రానుంది.
గూగుల్ ఏఐ అందుబాటులోకి వస్తే దొంగతనాలు కూడా తగ్గనున్నాయి. ఏఐ ఆధారిత సీసీ కెమెరాల ద్వారా దుండగుల నేర చరిత్రను తెలుసుకుని పోలీసులను అలర్ట్ చేయనున్నారు. దీంతో భక్తులకు దొంగల నుంచి రక్షణ లభిస్తుంది. ఇక భక్తులను తప్పుదారి పట్టించడం సాధ్యం కాదు.
విదేశీ భక్తులకు వారి భాషలోనే సమాచారం అందించనున్నారు. దీని ద్వారా వారు దళారుల భారిన పడటం తగ్గుతుంది. భక్తుల రద్దీని మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకునే సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఏఏ రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుంది, అనే విషయాలు కూడా గూగుల్ ఎప్పటికప్పుడు అందిస్తుంది.
ఇప్పటికే ఏఐ సాంకేతికతను కొన్ని దేవాలయాల్లో ఉపయోగిస్తున్నారు. అయితే తిరుమలలో సగటున 80 వేల మంది భక్తులు దర్శనాలకు వస్తుంటారు. వారికి వసతి, దర్శనం, ప్రసాదం, రవాణా సదుపాయాలు కల్పించడం సవాలుగా మారింది. ఏఐ టెక్నాలజీతో భక్తులకు మెరుగైన సేవలు అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకోనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు.
ఒప్పందం అనంతరం గూగుల్ ప్రతినిధులు తిరుమలలో పరిశీలన చేయనున్నారు. ఏఐ ఆధారిత సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు, ఉపగ్రహాల సాయం కూడా తీసుకుని రద్దీని అంచనా వేస్తారు. దీని ద్వారా భక్తులకు సమయం ఆదా అవుతుంది. సీఆర్‌వో కార్యాలయాల వద్ద రద్దీ తగ్గించేందుకు కూడా గూగుల్ ఏఐ సాయం చేయనుంది. పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి లోపాలను సవరించుకుని భక్తులకు దర్శనం సులభతరం చేయనున్నారు.