థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగే ఆరవ బిమ్స్‌టెక్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 3,4 తేదీల్లో పాల్గొంటారు. థాయ్‌లాండ్ పర్యటన ముగిసాక 4,5,6 తేదీల్లో శ్రీలంకలో పర్యటిస్తారు. థాయ్‌లాండ్ ప్రధానమంత్రి పెటొంగ్‌టార్న్ షినవత్ర ఆహ్వానం మేరకు భారత ప్రధాని మోదీ బిమ్స్‌టెక్ సదస్సులో పాల్గొంటారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. మోదీ థాయ్‌లాండ్‌లో అధికారిక పర్యటనకు వెళ్ళడం ఇది మూడోసారి.
బిమ్స్‌టెక్ సదస్సు 2018 తర్వాత మళ్ళీ భౌతికంగా సమావేశాలు జరగడం ఇదే మొదటిసారి. 2018లో నేపాల్ రాజధాని కాఠ్‌మాండూలో నాలుగవ బిమ్స్‌టెక్ సదస్సు జరిగింది. ఐదవ బిమ్స్‌టెక్ సదస్సు శ్రీలంక రాజధాని కొలంబోలో 2022లో జరిగింది. అయితే దాన్ని వర్చువల్‌గా నిర్వహించారు. ఇప్పుడు ఆరవ సదస్సు బ్యాంకాక్‌లో జరగబోతోంది.
బిమ్స్‌టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోపరేషన్…. ‘బంగాళాఖాత దేశాల మధ్య వివిధ రంగాల్లో సాంకేతిక, ఆర్థిక సహకారం కోసం సమన్వయం’ అని అర్ధం. ఇందులో బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాలు ఉన్నాయి.
‘‘ప్రాదేశిక సహకారాన్నీ, ప్రాంతీయ భాగస్వామ్యాన్నీ బలపరచుకోవడం కోసం భారత్ పలు చర్యలు తీసుకుంటోంది. భద్రతను పటిష్టం చేయడంతో పాటు వాణిజ్యం-పెట్టుబడులకు అవకాశం కల్పించడం, సభ్యదేశాల నడుమ భౌతికమైన, డిజిటల్ కనెక్టివిటీని పెంపొందించడం, వివిధ రంగాల్లో పరస్పర సహకారం, నైపుణ్యాల అభివృద్ధి, ప్రజల మధ్య పరస్పర సంబంధాలను విస్తరించడం వంటి చర్యలు తీసుకుంటోంది’’ అని విదేశాంగ శాఖ వెల్లడించింది.
ఏప్రిల్ మూడున భారత్-థాయ్‌లాండ్ ప్రధానమంత్రులు నేరుగా సమావేశమవుతారు. ద్వైపాక్షిక సహకారం, భవిష్యత్ భాగస్వామ్యాల వంటి అంశాల గురించి చర్చలు జరుపుతారు.
తర్వాత మోదీ థాయ్‌లాండ్ నుంచి శ్రీలంక వెడతారు. ఆ దేశ అధ్యక్షుడు అనూర కుమార దిసనాయక పిలుపు మేరకు మోదీ శ్రీలంకలో పర్యటించనున్నారు. 2019 తర్వాత మోదీ శ్రీలంకలో పర్యటించడం ఇదే మొదటిసారి. నిర్దేశిత రంగాల్లో పరస్పర సహకారం దిశలో జరుగుతున్న పురోగతి గురించి ఇద్దరు నాయకులూ చర్చిస్తారు. ఆ దేశపు ఇతర రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులతో కూడా సమావేశాలు జరుపుతారు. అనూరాధపురలో భారత్ ఆర్థిక సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు.