ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన సుమారు ఏడాది తర్వాత వైఎస్‌ఆర్‌సిపికి చిన్న ఊరట లభించింది. స్థానిక సంస్థల్లో అయిన ఖాళీలకు గురువారం జరిగిన ఉపయెన్నికల్లో ఆ పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. అధికార కూటమి నుంచి ఎన్ని ఒత్తిళ్ళు, ప్రలోభాలూ ఎదురైనా స్థానిక సంస్థల్లోని ప్రతినిధులు తమ పార్టీ సభ్యులకే అండగా నిలిచారని వైసీపీ హర్షం వ్యక్తం చేసింది.
గురువారం జరిగిన స్థానిక సంస్థల ఉపయెన్నికల్లో 1 జెడ్‌పి ఛైర్మన్, 24 ఎంపీపీ, 17 వైస్-ఎంపీపీ, 8 కోఆప్టెడ్ సభ్యులు మొత్తం 50 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో 40 స్థానాల్లో వైఎస్ఆర్‌సిపి అభ్యర్ధులు విజయం సాధించారు. 6 స్థానాల్లో టీడీపీ, 2 సీట్లలో జనసేన, 1 స్థానంలో బీజేపీ, 1 స్థానంలో స్వతంత్ర అభ్యర్ధులు గెలిచారు. ఒకే ఒక జెడ్‌పి ఛైర్మన్ పదవిని వైఎస్ఆర్‌సిపి దక్కించుకుంది. 24 ఎంపీపీల్లో 18 స్థానాలను, 17 వైస్ఎంపీపీల్లో 12 స్థానాలనూ ఆ పార్టీ గెలుచుకుంది. ఇంక 8మంది కో-ఆప్టెడ్ సభ్యుల స్థానాలూ వైఎస్ఆర్‌సీపీయే సొంతం చేసుకుంది. తెలుగుదేశం 4 ఎంపీపీలు, 2 వైస్ ఎంపీపీలను మాత్రం గెలుచుకుంది. జనసేన 1 ఎంపీపీ, 1 వైస్ ఎంపీపీని మాత్రం దక్కించుకుంది. 1 ఎంపీపీ బీజేపీకి, 1 వైస్ ఎంపీపీ సీటు స్వతంత్ర అభ్యర్ధికీ దక్కాయి.
కడప జిల్లా జెడ్‌పీ ఛైర్మన్‌గా బ్రహ్మంగారి మఠానికి చెందిన జెడ్‌పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందు రెడ్డి ఏకగ్రీవంగాఎన్నికయ్యారు. గురువారం ఉదయం 10 గంటలకు రామగోవిందు రెడ్డి నామినేషన్ దాఖలు చేసారు, 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ మొదలైంది. జెడ్‌పిటిసి సభ్యులు రామగోవింద రెడ్డి అభ్యర్ధిత్వాన్ని మాత్రమే ప్రతిపాదించి బలపరిచారు. దాంతో కలెక్టర్ ఆయనే గెలిచినట్లు ధ్రువీకరించారు.
జిల్లాలో 48మంది జెడ్పీటీసీ సభ్యుల్లో ఒక్కరు మాత్రమే టీడీపీ సభ్యుడు. మరో ఐదుగురు వైసీపీ సభ్యులు కొన్నాళ్ళ క్రితం తెలుగుదేశంలో చేరారు. ఆ ఆరుగురినీ వదిలేస్తే మిగతా 42మందీ వైసీపీకే మద్దతుగా నిలిచారు. వేంపల్లె జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్ రెడ్డి, తల్లి మరణంతో ఓటింగ్‌కు హాజరు కాలేకపోయారు. ఆయన మినహా మిగతా 41 మందీ… వైఎస్సార్ పార్టీ అభ్యర్ధినే ఓకగ్రీవంగా ఎన్నుకున్నారు. దాంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయంగా పూర్తయింది.
ఎన్నిక సమయంలో అధికార కూటమికి చెందిన నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ అభ్యర్ధులపై భౌతిక దాడులకు సైతం పాల్పడ్డారని వైఎస్ఆర్‌సిపి నాయకులు ఆరోపించారు. పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తుంటే పోలీసులు అడ్డగించకుండా ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేసారు.