గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. 2027 ఆగష్టులో గోదావరి పుష్కరాలు రానున్నాయి. అంతకు ముందే పోలవరం పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. సాంకేతిక సమస్యలు రాకుంటే 2027 ఆగష్టు నాటికి పోలవరం పూర్తి చేస్తామని, ఒకే వేళ అడ్డంకులు వస్తే 2027 డిసెంబరు నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామన్నారు. వచ్చే ఏడాది జులై నాటికి డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేసి, విటీ ద్వారా కాలువలకు నీరు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు.
పునరావాస కార్యక్రమాలు కూడా 2027 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మొదటి దశ పునరావాస నిర్మాణంలో 14 వేల కుటుంబాలకు 6 వేల కోట్లు ఖర్చుతో 49 ప్రాంతాల్లో కాలనీలు నిర్మించడానికి టెండర్లు పిలవనున్నారు. వైసీపీ పాలనలో పునరావాసం పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారు. వాటిని రద్దు చేసి తాజాగా టెండర్లు పిలవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
వైసీపీ పాలనలో పోలవరం పనులు పట్టించుకోకపోవడంతో డయా ఫ్రం వాల్ కొట్టుకుపోయి 5 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఏపీ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతో భారీగా నష్టం వాటిల్లిందన్నారు. 2027 నాటికి విద్యుత్ ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 2027 డిసెంబరు నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని ఇంజనీర్లకు దిశానిర్దేశం చేశారు.
2014 రాష్ట్ర విభజన చేసిన తరవాత టీడీపీ అధికారంలోకి వచ్చిందని, ఐదు ముంపు మండలాలు ఏపీలో విలీనం చేస్తేనే తాను పదవీ ప్రమాణం చేస్తానని పట్టుబట్టడం వల్లే పోలవరం సాధ్యమైందని సీఎం చంద్రబాబునాయుడు గుర్తుచేశారు. పోలవరం నిర్వాసిత గ్రామాలకు సమీపంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. మొదటి దశ పునరావాసం పూర్తి చేయడానికే 6 వేల కోట్లుపైగా ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.5 వేల కోట్లు మంజూరు చేసిందన్నారు. అన్ని విషయాల్లో కేంద్రం సహకారం అందిస్తోందని చంద్రబాబునాయుడు చెప్పారు.