పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లండన్ పర్యటనలో విద్యార్థుల నుంచి నిరసన సెగ తగిలింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కెల్లాగ్ కాలేజీలో సామాజిక అభివృద్ధి మహిళా సాధికారత అనే అంశంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగిస్తున్న సమయంలో విద్యార్థులు ఆర్జీ కర్ ఘటనపై నిరసనకు దిగారు. పెద్ద ఎత్తున నిరసన చేయడంతో సీఎం మమతా బెనర్జీ కేసు కేంద్రం చేతిలో ఉందని, విచారణ జరుగుతోందన్నారు. అయినా విద్యార్థులు నిరసన విరమించుకోకపోవడంతో 1990ల నాటి ఓ ఫోటోను చూపించి, చూశారా నన్ను హత్య చేయడానికి ఎన్ని కుట్రలు చేశారో అంటూ తనపై అప్పట్లో జరిగిన దాడిని గుర్తుచేశారు.
నిరసనకారులకు ఇది సరైన వేదిక కాదని హెచ్చరించారు. ఇక్కడ రాజకీయాలు చేయవద్దన్నారు. తాను దేశం తరపున ప్రతినిధిగా వచ్చానని చెప్పారు. తాను బెంగాల్ టైగర్‌నని ఎవరికి భయపడనన్నారు. దీంతో సభ మొత్తం చప్పట్లతో మారుమోగింది. తరవాత నిర్వాహకులు నిరసనకారులను బయటకు పంపించివేశారు.