వక్ఫ్ బోర్డు ఆస్తులను గతంలో కాపాడింది తెలుగుదేశం ప్రభుత్వమే అనీ, ఇప్పుడు కూడా తమ ప్రభుత్వమే వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుతుందనీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిములకు ఎనలేని మేలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పుకున్నారు. “ముస్లింలకు మా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. వక్ఫ్ బోర్డు ఆస్తులకు రక్షణ కల్పిస్తాం. 40 ఏళ్లుగా ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నా. ముస్లింలతో టీడీపీకి బలమైన అనుబంధం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లింలకు మేలు జరిగింది టీడీపీ హయాంలోనే. మొట్టమొదటిసారి మైనారిటీలకు ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఎన్టీఆర్ ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఉర్దూను రెండో భాషగా చేశాం. హైదరాబాద్ నుంచి మక్కా వెళ్లేందుకు హజ్ భవనం నిర్మించాం” అని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.
“ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో, విభజన తర్వాత కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. కడపలో హజ్‌హౌస్ నిర్మించాం. విజయవాడలో నిర్మించ తలపెడితే గత ప్రభుత్వం నిలిపేసింది. 2014-2019 మధ్య రూ.163 కోట్లతో 32,722 మంది మైనార్టీ వధువులకు దుల్హన్ సాయం అందించాం. పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించాం. ఇమామ్‌ల గౌరవ వేతనాలు రూ.10 వేలకు, మౌజన్ల గౌరవ వేతనాలు రూ.5 వేలకు పెంచాం. మొన్నటి బడ్జెట్లో ముస్లిం మైనారిటీలకు రూ.5,434 కోట్లు కేటాయించాం” అని చంద్రబాబు చెప్పారు.
ప్రభుత్వ ఇఫ్తార్‌ను బహిష్కరించిన ముస్లిం సంఘాలు:
కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును బహిష్కరిస్తున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ ఏపీ అధ్యక్షుడు రఫీక్ అహ్మద్ ప్రకటించారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం కాకుండా తిరస్కరించాలని తెలుగుదేశం పార్టీని కోరారు. ఆ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర శాసనసభలో సైతం తీర్మానం చేయాలని డిమాండ్ చేసారు. మరోవైపు, వక్ఫ్ ప్రొటెక్షన్ జేఏసీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆహ్వానాన్ని తిరస్కరించింది.