ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025 దేశపు అంతర్గత భద్రతను పటిష్ఠం చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆ బిల్లు ద్వారా ఒకే అంశంపై వేర్వేరుగా ఉన్న చట్టాలను ఏకీకృతం చేస్తున్నామని వివరించారు. చర్చ తర్వాత ఆ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది.
బిల్లుపై లోక్‌సభ చర్చలో జవాబిస్తూ అమిత్ షా మాట్లాడారు. భారతదేశం ధర్మసత్రం కాదనీ, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారికి దేశంలోని రానీయబోమనీ స్పష్టం చేసారు. ఈ దేశం అభివృద్ధికి తమవంతు కృషి చేసేవాళ్ళు వస్తే, అలాంటి వారికి స్వాగతం పలుకుతామని చెప్పారు. అలా కాకుండా భారతదేశంలో అల్లర్లు, అలజడులు సృష్టించే ఉద్దేశంతో వస్తే రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని అమిత్ షా చెప్పారు.
‘‘గత పదేళ్ళలో భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగింది. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉంది. ఉత్పాదక రంగానికి భారత్ కేంద్రస్థానంగా మారింది. ఇలాంటి సమయంలో ప్రపంచం అంతటి నుంచీ భారత్‌కు జనాలు రావడం సహజం. అలాగే వ్యక్తిగత ప్రయోజనాల కోసం భారత్‌లో ఆశ్రయం పొందుతూ ఈ దేశాన్ని ప్రమాదకరంగా మారుస్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. రోహింగ్యాలు కానివ్వండి, బంగ్లాదేశీయులు కానివ్వండి, భారత్‌లో ఘర్షణలు సృష్టించడానికి వస్తే వారిమీద కఠినమైన చర్యలు తీసుకుంటాం’’ అని స్పష్టంగా చెప్పారు.
ఇమిగ్రేషన్ ప్రత్యేకమైన అంశం కాదు. దేశానికి సంబంధించిన చాలా విషయాలు దానితో ముడిపడి ఉన్నాయి. జాతి భద్రత కోణం నుంచి చూస్తే, దేశపు సరిహద్దుల్లోనుంచి ప్రవేశిస్తున్న వారెవరో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దేశ భద్రతకు ముప్పుగా వాటిల్లే వారిమీద నిఘా పెడతాం’’ అన్నారు.
అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టం గురించి ప్రస్తావిస్తూ, పొరుగు దేశాల నుంచి అణచివేయబడిన ఆరు వర్గాలను శరణార్థులుగా భారత్‌లోకి అనుమతించేందుకు చట్టం చేసామన్నారు. ‘‘భారత్ భౌగోళిక-సాంస్కృతిక దేశమే తప్ప భౌగోళిక-రాజకీయ దేశం కాదు. భారతదేశానికి వచ్చిన పర్షియన్లు ఈ దేశంలో సురక్షితంగా ఉన్నారు. ప్రపంచంలోనే అతిచిన్న మైనారిటీ వర్గం భారత్‌లో మాత్రమే సురక్షితంగా ఉంది. ఇజ్రాయెల్ నుంచి యూదులు వచ్చి భారత్‌లో ఆశ్రయం పొందారు’’ అని గుర్తు చేసారు.
‘‘ఇమిగ్రేషన్ ప్రత్యేకంగా విడిగా ఉన్న అంశం కాదు. దేశ భద్రత కోసం, దేశంలోకి ఎవరు వస్తున్నారు, ఎంత కాలానికి వస్తున్నారు, ఏ కారణాల వల్ల వస్తున్నారు అన్న విషయాలు తప్పక తెలియాలి. ఇవేమీ కొత్త విషయాలు కావు. గతంలో ఈ హక్కులు వేర్వేరు చట్టాల కింద ప్రస్తావనలో ఉండేవి. ఇప్పుడు వాటిని ఒకచోట సమీకృతం చేసాము. ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ ద్వారా, దేశంలోకి ప్రవేశించే ప్రతీ విదేశీయుడి వివరాలనూ ట్రాక్ చేసేందుకు సవివరమైన, సునిర్మితమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. అది దేశాభివృద్ధిలోనూ, వ్యాపారం కోసం వచ్చిన వారిని గమనించడంలోనూ సాయపడుతుంది. అలాగే దేశ భద్రతకు ముప్పు కలిగించే వ్యక్తులను కనుగొనడానికి కూడా వీలు కల్పిస్తుంది’’ అని అమిత్ షా వివరించారు.