త్రిభాషా వివాదం మరింత ముదిరింది. కేంద్రానికి, తమిళనాడు మధ్య నెలకున్న ఈ వివాదం యూపీకి పాకింది. యూపీ సీఎం ఆదిత్యనాథ్ దాస్ యోగి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మధ్య మాటల యుద్దానికి తెరలేచింది. ఓటు బ్యాంకు ప్రమాదంలో పడటంతో స్టాలిన్ త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నారంటూ యోగి చేసిన వ్యాఖ్యలకు స్టాలిన్ ఘాటుగా సమాధానం చెప్పారు. యోగి బ్లాక్ కామెడీ చేస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. యోగి తమకు పాఠాలు నేర్పడం బ్లాక్ కామెడీలా ఉందన్నారు.
త్రిభాషా సూత్రం, నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై తమిళనాడు గట్టిగా పోరాడుతోంది. దీంతో బీజేపీ భయపడుతోందంటూ స్టాలిన్ వ్యాఖ్యానించారు. అందుకే బీజేపీ రకరకాలుగా మాట్లాడిస్తోందన్నారు. యోగి మాకు రాజకీయ పాఠాలు నేర్పాలనుకుంటున్నారా? మమ్మల్ని వదిలేయండి. ఇది రాజకీయంగా అత్యున్నత స్థాయి డార్క్ కామెడీ అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తాము ఏ భాషను వ్యతిరేకించం కానీ బలవంతంగా రుద్దితే మాత్రం ఊరుకోమని స్టాలిన్ హెచ్చరించారు.
ప్రజల దృష్టిని మళ్లించడానికే స్టాలిన్ ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై విమర్శలు చేశారు.
జాతీయ విద్యావిధానంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మూడు భాషలను నేర్చుకోవాలని సూచించింది. అందులో రెండు దేశీయ భాషలుండాలయి. అయితే తమిళనాడుపై హిందీని రుద్దాలని చూస్తున్నారంటూ అధికార డీఎంకే నాయకులు విమర్శలు చేస్తున్నారు.