రెండు రోజుల క్రితం టీటీడీ బోర్డు సమావేశంలో ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ శ్యామలరావు మాట్లాడుతూ టీటీడీకి సరుకులు దానంగా ఇస్తున్న ఒక దాత సేవలు ఇంక అక్కర్లేదనీ, అతని సంస్థను బ్లాక్‌లిస్ట్ చేసామనీ చెప్పారు. ఆ వ్యక్తి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులను సరఫరా చేస్తున్నానంటూ చెప్పి, నాసిరకం పదార్ధాలను అంటగట్టాడని వెల్లడైంది. సాధారణ నిత్యావసర వస్తువులను సైతం కల్తీ చేసి సరఫరా చేసారని తేలింది. టీటీడీ కొత్త పాలకవర్గం వచ్చాక నఆ వస్తువుల నాణ్యతపై పరీక్షలు చేయంచడంతో అసలు విషయం వెలుగు చూసింది.
తిరుమల వేంకటేశ్వరుడి ఆలయంలో సమర్పించే ప్రసాదాల తయారీలో వాడే ముడిసరుకులు, ఇతర దినుసులు అన్నీ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఉత్పత్తి అయినవే వినియోగించాలని గత వైఎస్ఆర్‌సిపి హయాంలో 2021లో నిర్ణయం తీసుకున్నారు. ఆ సందర్భంగా అమలాపురం ప్రాంతానికి చెందిన నిమ్మకాయల సత్యనారాయణ అనే రొయ్యల ఫీడ్ వ్యాపారి ముందుకు వచ్చారు. ‘శ్రీనివాసా సేవా ట్రస్ట్’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నాననీ, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను టీటీడీకి సరఫరా చేస్తాననీ చెప్పుకొచ్చారు.
అప్పటినుంచీ టిటిడికి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల పేరిట ప్రసాదాల తయారీకి కావలసిన ముడిసరుకులు అన్నీ ఆయనే సరఫరా చేయసాగారు. అయితే వాటిలో సాధారణ ఉత్పత్తులనే పంపించారని, నిత్యావసర వస్తువులు సైతం కల్తీవి సరఫరా చేసారనీ తేలింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక శ్రీనివాసా సేవా ట్రస్ట్ పంపిస్తున్న ఉత్పత్తుల నాణ్యతను తనిఖీ చేయించినప్పుడు ఆ విషయం బైటపడింది. ఆ ట్రస్ట్ నాలుగేళ్ళ పాటు పంపిన ఉత్పత్తుల్లో ఎంతమేర అక్రమాలు జరిగి ఉంటాయో ఊహించుకోవలసిందే. ఇప్పుడు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని కచ్చితంగా తేలినందున ఆ సంస్థను టీటీడీ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది.
కథ అక్కడితో ముగిసిపోలేదు. స్వామికి సేవ చేస్తున్నందుకు తనకు దర్శనాలు కావాలని కోరి, నిమ్మకాయల సత్యనారాయణ విశిష్ఠ దర్శనాలు అసంఖ్యాకంగా పొందారు. రోజుకు రూ.లక్ష విలువైన సేంద్రియ ఉత్పత్తులను అందిస్తున్నాను కాబట్టి తనకు ప్రతీ పది లక్షల విలువకు ఒక బ్రేక్ దర్శనం సౌకర్యం కల్పించాలని అప్పటి ఈఓ, ఛైర్మన్‌లను కోరారు. వారు వెంటనే ఆన్‌లైన్‌లో ఆ అవకాశం కల్పించారు.
నిజానికి నగదు విరాళాలకు తప్ప స్వామివారికి స్వర్ణాభరణాలు, విలువైన వస్తువులను కానుకలుగా సమర్పించినా, లేక విలువైన సేవలు అందజేసినా కూడా అలాంటి వారికి సైతం టీటీడీ ఎటువంటి ప్రివిలేజ్ దర్శనాలూ కల్పించదు. దానికి విరుద్ధంగా శ్రీనివాసా సేవా ట్రస్ట్‌కు మాత్రం గొప్ప అవకాశాలు ఇచ్చారు. నిమ్మకాయల సత్యనారాయణకు నాలుగేళ్ళ వ్యవధిలో సుమారు 85 వీఐపీ ప్రివిలేజ్ పాస్‌లు ఇచ్చినట్లు సమాచారం. ఆ పాస్‌లను 20 సంవత్సరాల పాటు వాడుకోవచ్చు. ఒక్కొక్క పాస్‌బుక్‌తో ఏడాది మూడుసార్లు ఒక్కోసారీ ఐదుగురికి బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం కలుగుతుంది. వారికి తిరుమలలో ఉచిత వసతి కూడా కల్పిస్తారు. అలా నాలుగేళ్ళలో 5100 మందికి బ్రేక్ దర్శనాలు చేయించినట్లు సమాచారం.
అంతే కాదు, టీటీడీ ఉన్నతాధికారుల పేర్లు వాడుకుని ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాల పేరుతో మరో 17వేల టికెట్లు సంపాదించారని తెలుస్తోంది. అలా, ఒక దాతగా నిమ్మకాయల సత్యనారాయణ టీటీడీలో బోలెడన్ని ప్రయోజనాలు పొందారని సమాచారం.
ఈ విషయాలన్నీ వెలుగు చూడడంతోనే టీటీడీ, సత్యనారాయణకు చెందిన శ్రీనివాస సేవా ట్రస్ట్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిందని అర్ధమవుతోంది.