విద్యారంగంలో సంస్కరణలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో రెండు మేజర్ సబ్జెక్టులు తీసుకురావాలని నిర్ణయించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక డిగ్రీలో ఒక మేజర్ సబ్జెక్టు విధానం అమలు చేస్తున్నారు. బోధకుల కొరత లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో సమర్థించుకున్నారు. అప్పటి ప్రభుత్వ నిర్ణయంతో చాలా కాలేజీల్లో బీఎస్సీ కంప్యూటర్స్, బీకాం కంప్యూటర్స్ కోర్సులు మాత్రమే అందుబాటులో ఉంచారు. చాలా కోర్సులు అందుబాటులో లేకుండా పోయాయి.
వచ్చే ఏడాది నుంచి డిగ్రీలో రెండు మేజర్ సబ్జెక్టులతోపాటు, మైనర్ సబ్జెక్టులు కూడా అందుబాటులో ఉంచనున్నారు. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం ప్రకారం మూడేళ్ల డిగ్రీకి 120 క్రెడిట్లు ఉండాలి. నాలుగేళ్ల డిగ్రీకి 160 క్రెడిట్లు ఉండాలి. 2020 నుంచి నాలుగేళ్ల డిగ్రీని అమలు చేస్తున్నారు. అయితే చాలా మంది మూడేళ్ల డిగ్రీ చదువుతున్నారు.
యూజీసీ ప్రకారం మేజర్ సబ్జెక్టుకు 50 శాతం క్రెడిట్లు ఇవ్వాల్సి ఉంటుంది. రెండో మేజర్
40 శాతం క్రెడిట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్, డాటా అనలిటికల్స్ సబ్జెక్టులను డిగ్రీలో ప్రవేశ పెట్టనున్నారు. మూడు సబ్జెక్టుల విధానం అమల్లోకి వస్తే మల్టీ డిసిప్లీనరి అమల్లోకి వచ్చినట్లవుతుంది.
డిగ్రీ కరిక్యులమ్ మార్పును అధ్యయనం చేసేందుకు ఉన్నత విద్యామండలి కమిటీ ఏర్పాటు చేసింది. కృష్ణా విశ్వవిద్యాలయం విశ్రాంత ఉప కులపతి వి.వెంకయ్యను ఛైర్మన్‌గా నియమించారు. 12 మంది సభ్యులుంటారు. ఉన్నత విద్యామండలి అకడమిక్ అధికారి శ్రీరంగం కమిటీకి సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ట్రిపుల్ టీ బెంగళూరు మాజీ డైరెక్టర్ ఎస్ సదాగోపన్,నార్ కరోలినా విల్మింగ్టన్ ఛాన్సలర్ అశ్వనీ కె.వోలేటిని నియమించారు. మూడు వారాల్లో కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.