వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ఇప్పటి నుంచే సిద్దం అవుతోంది. ఇందుకు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఐఏఎస్‌లు వీరపాండ్యన్, విజయ్‌రామరాజును నియమిస్తూ సీఎ నిర్ణయం తీసుకున్నారు. వీరు గోదావరి పుష్కర పనులను పర్యవేక్షించనున్నారు. పనుల ప్రతిపాదనలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక, చేపట్టాల్సి పనులను గుర్తించి సకాలంలో చేపట్టి, పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటారు.
గోదావరి నదీ తీరంలోని ఆలయాలు, పుణ్య క్షేత్రాలు, సుందర ప్రదేశాల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళిక సిద్దం చేయనున్నారు. రాజమహేంద్రవరంలో పుష్కరాల నాటికి 5 వేల గదులు అందుబాటులోకి తీసుకురానున్నాయి. గోదావరి డెల్టాలో మూడు పంటలు సాగు చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు.
యూపీలోని కుంభమేళా ఏర్పాట్లను పరిశీలించ వచ్చిన ఏపీ అధికారులు, గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. దాదాపు 6 కోట్ల మంది పుష్కరాల్లో పాల్గొంటారని అంచనా వేశారు. అందుకు అనుగుణంగా మౌలికసదుపాయాలు అభివృద్ధి చేయనున్నారు.